సంక్రాంతి సెంటిమెంట్ తో వచ్చే ఏడాది ఎఫ్ 3

0

వరుసగా మూడు సంవత్సరాలు సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసి హ్యాట్రిక్ దక్కించుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి ఎఫ్ 3 సినిమాను విడుదల చేయాలనుకున్నాడు. కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టలేక పోయాడు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయ్యింది. అయితే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ఇతర సినిమాలతో వేరు వేరుగా బిజీగా ఉన్న కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది. మొన్నటి వరకు డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు అనీల్ రావిపూడి కోరుకున్నాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

గత మూడు సంవత్సరాలుగా తన సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తూ వచ్చిన అనీల్ రావిపూడి ఈసారి సంక్రాంతికి మాత్రం తన ఎఫ్ 3 సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు. సంక్రాంతి రోజున ఎఫ్ 3 ని లాంచనంగా ప్రారంభించి వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు లేదా ఉగాది కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అనీల్ రావిపూడి సంక్రాంతిని మిస్ చేసుకోకుండా సినిమా విడుదల చేయలేకపోయినా ఆ రోజున ఎఫ్ 3 షూటింగ్ ప్రారంభించడం ద్వారా సెంటిమెంట్ ను కంటిన్యూ చేయనున్నాడని తెలుస్తోంది.