‘పబ్జీ’ కి ప్రత్యామ్నాయమైన ‘FAU-G’ టీజర్ ని రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్..!

0

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ దక్కించుకున్న ‘పబ్జీ’ గేమ్ ని దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం ఇండియాలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘పబ్జీ’ మొబైల్ మరియు పబ్జీ లైట్ యాప్స్ మనదేశంలో నిషేధించబడగానే దేనికి ప్రత్యామ్నాయంగా ‘FAU-G’ (ఫా-జీ) అనే గేమ్ ని తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫా-జీ గేమ్ ని నవంబర్ లో లాంచ్ చేస్తున్నట్లు గేమ్ రూపకర్తలు ఎన్కోర్ గేమ్స్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ‘FAU-G’ అంటే ‘ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్’. దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ గేమ్ ను రూపొందించారు. ఫా-జీ గేమ్ లో మొదటి లెవల్ భారత్ – చైనా మధ్య గాల్వాన్ లోయ వివాదం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

దసరా సందర్భంగా ‘FAU-G’ కి సంబంధించిన ఫస్ట్ టీజర్ ను అక్షయ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్షయ్ ట్వీట్ చేస్తూ ‘ఈ రోజు మనం చెడుపై మంచి విజయాన్ని జరుపుకుంటాము. మన FAU-G ను జరుపుకోవడానికి ఇంతకంటే మంచి రోజు ఏముంటుంది. దసరా సందర్భంగా FAU-G టీజర్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం” అని పేర్కొన్నారు. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ లో ఫా-జీ గేమ్ ఫస్ట్ లెవల్ ను చూపించారు. శత్రువులతో పోరాటం చేయడానికి ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలి.. ఎలాంటి ఆయుధాలు రూపొందించాలి అనేది ఈ టీజర్ లో చూపించారు. కాగా ఈ గేమ్ ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతాన్ని భారతప్రభుత్వ నగదు సేకరణ కార్యక్రమం ‘భారత్ కే వీర్’కు ఎన్కోర్ గేమ్స్ అందించనుంది. అయితే ఈ గేమ్ మనదేశంలో పబ్జీ స్థాయిలో ఆదరణ సంపాదించుకుంటుందా లేదా అన్నది చూడాలి.