మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్‌గా పూజా హెగ్డే.. ఇదిగో ఫస్ట్ లుక్

0

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని అఖిల్ లుక్‌ను ఇప్పటికే విడుదల చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వేసే ఏడడుగుల్లో ఒక అడుగు ఇదోగనంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈనెల 8న వదిలారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్‌గా పూజా హెగ్డే లుక్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే విభ పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పూజా హెగ్డే చాలా అందంగా కనిపిస్తున్నారు. రెండు చేతుల్లో షూలు పట్టుకుని మనకు వాటిని చూపిస్తున్నట్టు ఉంది ఈ లుక్. దీన్ని రెండో అడుగుగా చిత్ర యూనిట్ చెబుతోంది. మొత్తం మీద వెరైటీ పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

ఇదిలా ఉంటే, అక్కినేని న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ ఇంకా సరైన కమర్షియల్ హిట్‌ను అందుకోలేదు. తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ అయ్యింది. రెండో సినిమా ‘హలో’ పర్వాలేదనిపించినా కలెక్షన్లు రాలేదు. ఇక మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ పరిస్థితి కూడా అంతే. దీంతో ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేకంగా మార్కెట్‌ను ఏర్పరుచుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు.


మరోవైపు, ‘బొమ్మరిల్లు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నారు దర్శకుడు భాస్కర్. అయితే, ‘ఆరెంజ్’ సినిమా దెబ్బకు ఆయన చాలా కాలం కనిపించకుండా పోయారు. సుధీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. భాస్కర్ సినిమా అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. వాటితో పాటు యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకథ కూడా ఉంటుంది. కాబట్టి, ఈ సినిమాతో అటు అఖిల్, ఇటు భాస్కర్ హిట్ ట్రాక్‌లోకి వస్తారని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.
Please Read Disclaimer