కేజీఎఫ్ స్టార్ తో బిగ్ బాస్ ముద్దుగుమ్మ పెళ్లి

0

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పూజా రామచంద్రన్ పెళ్లి చేసుకుంది. సినిమాల్లో చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన పూజా గత ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీతోనే అందరికి షాక్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ ను దడదడలాడించిన పూజా రామచంద్రన్ అదే స్థాయిలో వివాదాస్పదురాలు కూడా అయ్యింది. సినిమాల ద్వారా కంటే బిగ్ బాస్ ద్వారా ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గర అయిన పూజా రామచంద్రన్ గత కొన్నాళ్లుగా నటుడు అనీష్ జాన్ కొక్కన్ తో ప్రేమలో ఉంది. తెలుగు మరియు సౌత్ లోని దాదాపు అన్ని భాషల్లో కూడా అనీష్ నటించాడు. పలు నెగటివ్ పాత్రల్లో ఆకట్టుకున్నాడు. బాహుబలితో పాటు ఇటీవల సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీఎఫ్’ వంటి చిత్రంలో కూడా అనీష్ జాన్ నటించాడు.

బిగ్ బాస్ కు వెళ్లిన సమయంలో ఈ అమ్మడి ప్రేమ విషయం అందరికి తెలిసింది. మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని రెండేళ్లుగా అనీష్ జాన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటే ఒక ఇంటర్వ్యూలో కూడా పూజా రామచంద్రన్ ప్రకటించింది. అన్నట్లుగానే కేరళ సాంప్రదాయ పద్దతిలో అనీష్ జాన్ ను పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

నాకు ఇష్టమైన స్నేహితుడిని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం కేరళలో విష్ణు పర్వదినం కొనసాగుతుంది. ఇలాంటి మంచి సమయంలో మీతో నా పెళ్లి విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది. ఇంతకంటే మంచి సమయం లేదని మీ అందరితో నా పెళ్లి విషయాన్ని చెప్పాను అంటూ పూజా రామచంద్రన్ సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి విషయాన్ని చెప్పుకొచ్చింది. అనీష్ కూడా రెండవ వివాహమే. అతడు మీనా వాసుదేవ్ అనే నటిని గతంలో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే విభేదాల కారణంగా ఇద్దరు విడిపోయారు. రెండేళ్లుగా పూజాతో సహజీవనం సాగిస్తూ తాజాగా పెళ్లి చేసుకున్నాడు.
Please Read Disclaimer