జనవరి తొలి వారం మెగా ఈవెంట్ల ధమాకా

0

2020 సంక్రాంతి కానుకగా జనవరి తొలి రెండు వారాల్లో నాలుగు సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 1 నుంచి మొదటి వారం నాలుగైదు సినిమాలు రిలీజవుతుంటే వీటికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్లతో ఇప్పటికే హడావుడి సాగింది. ఇకపోతే జనవరి రెండో వారంలో తొలిగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ రిలీజ్ కానుంది. జనవరి 9న (గురువారం) రిలీజ్ తేదీ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

అంతకుముందే జనవరి 3న దర్బార్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ సహా చిత్రబృందం ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన పాటల్ని ఈ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ ఈవెంట్ అనంతరం సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనుంది. జనవరి 5 సరిలేరు ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లలో ఉంది చిత్రబృందం. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రిలీజ్ కానుంది. అంటే దర్బార్ రిలీజైన రెండ్రోజులకు మహేష్ ట్రీట్ ఉంటుందన్నమాట. ఈ రెండు సినిమాల ప్రీరిలీజ్ వేడుకలు అభిమానుల్లో ఉత్సాహం నింపనున్నాయి.

అలాగే జనవరి 12న అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` రిలీజవుతోంది. ఈ సినిమా ఈవెంట్ ని జనవరి 5 తర్వాత నిర్వహించనున్నారని ఆ టీమ్ నుంచి సమాచారం అందింది. త్రివిక్రమ్- రాధాకృష్ణ బృందానికి అత్యంత సన్నిహితుడు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎటెండ్ కానున్నారని తెలుస్తోంది. అటుపై సంక్రాంతి రేస్ లోనే రిలజీవుతున్న `ఎంత మంచివాడవురా` ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రం జనవరి 15న రిలీజవుతోంది. సతీష్ వేగేష్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా ఇలా నాలుగైదు రోజుల గ్యాప్ లోనే భారీ ఈవెంట్లు భారీ రిలీజ్ లతో సంక్రాంతి వేడెక్కిపోతోంది. ముఖ్యంగా జనవరి తొలి వారం వరుస ఈవెంట్లతో మోతెక్కనుందనే చెప్పాలి.
Please Read Disclaimer