ప్రముఖ సింగర్ ను సోషల్ మీడియా చంపే ప్రయత్నం విఫలం

0

కాస్త వింతగా.. మరికాస్తా విచిత్రంగా అనిపించినా ఇది నిజం. తన సంచలనాల కోసం ప్రముఖుల్ని అప్పుడప్పుడు వార్తల్లో చంపేసే పాడుపని చేయటం టీవీ ఛానళ్లతో మొదలైంది. అది అంతకంతకూ ఎక్కువ కావటంతో నిక్షేపంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు చనిపోయినట్లుగా వార్తల్లో నిలవటం తెలిసిందే. తమను చంపేసిన చానళ్లను ఏమీ అనలేక.. గుడ్ల నీరు కక్కుకునే ప్రముఖులకు ఇప్పుడు సోషల్ మీడియా అనే శత్రువు తరచూ సవాలు విసురుతోంది. ఏ క్షణాన ఎందులో ఇరికిస్తారో అర్థం కాక కిందామీదా పడే పరిస్థితి.

ఇలాంటివేళ.. అప్రమత్తంగా ఉండటం తప్పించి ఇంకేమీ చేయలేని పరిస్థితి. తాజాగా ప్రముఖ చిత్ర గాయని ఎస్.జానకి మరణించినట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. సోషల్ మీడియాను సాధనంగా చేసుకున్న ఈ ప్రచారాన్ని విజయవంతంగా నిలువరించగలిగారు. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన వారికి ఆమె థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే.. సోషల్ మీడియా తనను చంపేయటమే కాదు.. మాయదారి రోగాన్ని అంటకట్టే ప్రయత్నం చేశారు.

అయితే.. ఈ అంశం మీడియా ముందుకు రావటం.. వారొక్కసారి ఉలిక్కిపడటమే కాదు.. వెంటనే జానకమ్మ కుటుంబీకుల్ని లైన్లోకి తీసుకోవటంతో ఇష్యూ అక్కడితో ఆగిందని చెప్పక తప్పదు. జానమ్మను సోషల్ మీడియాలో చంపేసి రాక్షస ఆనందం పొందే వైనాన్ని గుర్తించిన ఆమె సన్నిహితులు వెంటనే ఆమెను అలెర్టు చేశారు. అంతే.. క్షణాల వ్యవధిలో ఆమె కుటుంబ సభ్యులు ఆమె మరణించారంటూ సాగిస్తున్న ప్రచారానికి చెక్ పెడుతూ తన పీఆర్వోద్వారా మీడియాతో పాటు.. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టేసి ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో.. సోషల్ మీడియా జరిపిన హత్యాయత్నం నుంచి జానకమ్మ సులువుగా బయటపడ్డారని చెప్పక తప్పదు.
Please Read Disclaimer