ట్రైలర్ టాక్: ‘గమనం’..!

0

టాలీవుడ్ నటీమణులు శ్రియా శరణ్ – నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఇండియా మూవీ ”గమనం”. ఇందులో ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ – శివ కందుకూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో రూపొందిన ఈ రియల్ లైఫ్ డ్రామాకు సుజనా రావు దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాతగా మారి రమేష్ కరుటూరి – వెంకీ పుషడపు లతో కలిసి క్రియా ఫిలిం కార్పొరేషన్ – కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో ‘గమనం’ చిత్ర ట్రైలర్ ని ఈరోజు (నవంబర్ 11) ఉదయం 9.09 గంటలకు విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేయగా.. హిందీ ట్రైలర్ ను సోనూసూద్.. తమిళ ట్రైలర్ ను జయం రవి.. కన్నడ ట్రైలర్ ను శివ రాజ్ కుమార్.. మలయాళంలో ఫహద్ ఫాసిల్ విడుదల రిలీజ్ చేశారు.

‘గమనం’ ట్రైలర్ 2. 24 నిమిషాల నిడివితో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మూడు వేరు వేరు కథలను తీసుకొని ఈ రియల్ లైఫ్ డ్రామాను రూపొందించినట్లు తెలుస్తోంది. శ్రియా చెవిటి మహిళగా.. దుబాయ్ కి వెళ్లిన భర్త కోసం ఎదురు చూసే సాధారణ గృహిణి పాత్రలో కనిపిస్తోంది. కానీ అతన దుబాయ్ లోనే వేరే అమ్మాయిని వివాహం చేసుకొని శ్రియా ను వదిలేసినట్లు తెలుస్తోంది. అలానే ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలని కలలు కనే ముస్లిం యువకుడిగా శివ కందుకూరి.. అతని గర్ల్ ఫ్రెండ్ గా ప్రియాంక జవాల్కర్ నటించింది. బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడానికి ఆశ పడే అనాథ వీధి బాలలను కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. నిత్యా మీనన్ గాయనిగా నటించినట్లు ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వీరందరి లైఫ్ లో జరిగిన సంఘటనల సమూహారమే ఈ చిత్రమని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా సుజన రావు ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేసే ఆసక్తికరమైన మరియు సున్నితమైన స్టోరీ లైన్ తో ముందుకు వచ్చినట్లు అర్థం అవుతోంది. అలానే శ్రియ శరణ్ – శివ కందుకూరి – ప్రియాంక జవాల్కర్ మరియు ఇతర యాక్టర్స్ అందరూ అద్భుతంగా పోషించారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా అందించిన సంభాషణలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అలానే మాస్ట్రో ఇళయరాజా నేపథ్య సంగీతం హృదయానికి హత్తుకునేలా ఉంది. జ్ఞాన శేఖర్ వి.ఎస్. తన కెమెరా వర్క్ తో అద్భుతమైన విజువల్స్ అందించాడు. భావోద్వేగాలు కలబోసిన ‘గమనం’ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.