ఎయిర్ పోర్ట్ లో చిక్కిన గ్యాంగ్ లీడర్

0

నేచురల్ స్టార్ నాని సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాను ఎక్కడికి వెళ్లినా చాలా సింపుల్ గా వెళతారు. రియాలిటీలో ఎలాంటి హంగు ఆర్భాటం ఉండదు. నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లోనూ అంతే సింపుల్ గా కనిపించారు. సింపుల్ వైట్ టీషర్ట్.. డెనిమ్ జీన్స్ .. పైన లెదర్ జాకెట్ తో సాధారణ ప్రయాణీకుడిలా వెళ్లారు. అంతేకాదు.. విమానాశ్రయంలో చెకప్ సందర్భంలోనూ నాని ఎలాంటి హడావుడి చేయకుండా అధికారుల విధి నిర్వాహణకు సహకరించారు.

నాని ప్రయాణం ఎక్కడికి అన్నది అటుంచితే.. అతడు నటించిన `గ్యాంగ్ లీడర్` రిలీజ్ కి ఇంకెంతో సమయం లేదు. సెప్టెంబర్ 13న రిలీజ్ కాబట్టి ఫట్టుమని 25 రోజులు కూడా లేదు. అందుకే ఇకపై ప్రమోషన్స్ లోనూ అంతే బిజీ కానున్నాడు. ఆగస్టు 30న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రభాస్ అన్న కోసం నాని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. సాహో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రిలీజవుతోంది. ఆ సినిమా కోసమే తన సినిమాని వాయిదా వేసుకున్నాడు నాని. సాహో అద్భుత విజయం సాధించాలని.. ఆ సెలబ్రేషన్స్ తెలుగు వారంతా ఘనంగా చేసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో నాని కోరారు.

నాని నటించిన జెర్సీ ఇటీవలే రిలీజై క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్నా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. తదుపరి విక్రమ్.కె దర్శకత్వం వహిస్తున్న `గ్యాంగ్ లీడర్` ఘనవిజయంపైనే నాని హోప్స్. నాని- అతడి లేడీ గ్యాంగ్ చేసే అల్లరి దాని నుంచి పుట్టుకొచ్చే ఫన్ ఆధారంగా రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఏ స్థాయిలో తెరపై రంజింపజేయనుందో చూడాలి. ఇప్పటికే టీజర్ – ట్రైలర్ ఆకట్టుకున్నాయి. జనాల్లో హైప్ నెలకొంది. ఆ మేరకు అంచనాల్ని అందుకునే కంటెంట్ తో వస్తున్నామని మైత్రి సంస్థ ధీమాని వ్యక్తం చేస్తోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ప్రచారానికి నాని ఈసారి కొత్తగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Please Read Disclaimer