Templates by BIGtheme NET
Home >> Cinema News >> కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ టీజర్…!

కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ టీజర్…!


‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజ్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి – జగపతి బాబు – రమాప్రభ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ మలయాళ భాషల్లో రూపొందిన ‘గుడ్ లక్ సఖి’ టీజర్ ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తాజాగా విడుదల చేసారు. తెలుగు టీజర్ ప్రభాస్ విడుదల చేయగా.. తమిళ్ లో విజయ్ సేతుపతి.. మలయాళంలో పృథ్వీ రాజ్ రిలీజ్ చేసారు.

కాగా ‘గుడ్ లక్ సఖి’ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ‘మన తల రాత మనమే రాసుకోవాలి’ అనే కాన్సెప్ట్ తో బ్యాడ్ లక్ ఉన్న ఓ పల్లెటూరి అమ్మాయి గుడ్ లక్ అని ఎలా అనిపించుకుంది అనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారించిన కీర్తి మరోసారి నటనకు ఆస్కారం ఉన్న రోల్ నే ఎంచుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ షూటర్ గా మారిన గిరిజన యువతిగా కనిపిస్తోంది. ఆది పినిశెట్టి పల్లెటూర్లో నాటకాలు వేసుకునే యువకుడిగా కనిపించగా.. జగపతి బాబు షూటర్స్ ని తయారు చేసే కోచ్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘గుడ్ లక్ సఖి’ కరోనా వల్ల నిలుపుదల చేసుకుంది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే మిగిలిన వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేయనున్నారు.