గుడ్ న్యూజ్ ట్రైలర్ టాక్

0

బాలీవుడ్ లో గత కొంత కాలంగా గమ్మత్తైన సృజనాత్మక కథలతో సినిమాలొస్తున్నాయి. అదే కోవలో వస్తున్న మరో విభిన్నమైన చిత్రం `గుడ్ న్యూజ్`. గత కొంత కాలంగా వెరైటీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న కిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రమిది. అక్షయ్ తో పాటు పంజాబీ కం పాప్ సింగర్ దిల్జిత్ దొసాంజే మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే క్యూరియాసిటీ పెంచాయి. తాజాగా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

అక్షయ్ కి జోడీగా కరీనా కపూర్.. దిల్జిత్ దొసాంజేకు జోడీగా కియారా అద్వానీ నటించింది. ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై క్రేజీ ఫిలిం మేకర్ కరణ్ జోహార్.. వేరొక నిర్మాత హీరూ జోహార్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రాజ్ మెహతా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. డిసెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ తోనే కాన్సెప్టుపై క్యూరియాసిటీ పెరిగింది. ఒకరి భార్య మరొకరి బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తే ఎలా వుంటుంది అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఆద్యందం వినోదాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచినట్టు కనిపిస్తోంది.

ట్రైలర్ లో అక్షయ్ భార్యగా నటిస్తున్న కరీనా కపూర్.. మరో హీరో దిల్జిత్ దొసాంజే బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తుంది. అలాగని ఇదేమీ సరోగసీ కానేకాదు. ఒక రకంగా కన్ఫ్యూజన్ సరోగసి అని చెప్పాలి. దిల్జిత్ దొసాంజేకు భార్యగా నటిస్తున్న కియారా అద్వానీ హీరో అక్షయ్ కుమార్ బిడ్డకు జన్మనివ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. డాక్టర్ల పొరపాటు వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరం. పూర్తి స్థాయి హాస్యభరితంగా రూపొందుతున్న ఈ సినిమాతో అక్షయ్- దిల్జిత్- కరీనా- కియారా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలంటే డిసెంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer