హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్ షిప్’ మోషన్ పోస్టర్ అదిరిందిగా..!

0

ఇండియన్ టాప్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్.. హీరో అవతారం ఎత్తి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇన్నాళ్లు గ్రౌండ్లో.. యాడ్ ఫిలిమ్స్ లో సత్తా చూపించిన భజ్జీ.. ఇక తన యాక్టింగ్ టాలెంట్ వెండితెర పై చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ విషయాన్ని ఇదివరకే స్వయంగా తానే సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేగాక తను నటించనున్న సినిమా పోస్టర్ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భజ్జీ భాయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఫ్రెండ్షిప్’. అయితే అది తమిళ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు జాన్ పాల్ రాజ్ షామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. జేపీఆర్ స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియానేసన్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో భజ్జి విడుదల చేసిన పోస్టర్ లో ఇద్దరు వ్యక్తుల చేతులకు బేడీలు వేసి ఉంది.

ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. దక్షిణ భారతీయ సినిమాలో ఓ క్రికెటర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మొదటి చిత్రం ఇది. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ చాలా రిచ్గా ఉంది. ఈ సినిమా మంచి కథాంశంతో అలాగే సాంకేతిక విలువలతో తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ ఏడాది థియేటర్లలో కూడా సందడి చేయనుందని భావిస్తున్నారు. అయితే భజ్జి.. బాలీవుడ్ నటి గీతా బస్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో గీతాబస్రా నటించిన ‘సెకండ్ హ్యాండ్ హస్బెండ్’ సినిమాలో కూడా హర్భజన్ ఓ కీలక పాత్ర పోషించాడు. అయితే భజ్జి సినిమాల్లోకి రావడం వెనుక భార్య గీత సపోర్ట్ కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని కేవలం తమిళంలోనే కాకుండా పలు బాషలలో విడుదల చేస్తారట. క్రికెట్ లో మ్యాజిక్ చేసిన భజ్జి థియేటర్స్లో ఎలా మాయ చేస్తాడో చూడాలి మరి!




Please Read Disclaimer