60లో కఠోర శ్రామికులు

0

యంగ్ హీరోల నుంచి పోటీ.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి.. టెక్నికల్ గా మారిన ట్రెండ్.. వెరసి ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని మరి కొంత కాలం లైమ్ లైట్ లో వుండాలంటే శ్రమించక తప్పదు. వయసుతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయాల్సిందే. అందుకు ఒళ్లు వంచి ప్రేక్షకులకు నచ్చినట్లుగా కనిపించడానికి భారీగా కసరత్తులు చేయాల్సిందే. టాలీవుడ్ లో ఆరు పదులు దాటిన హీరోలకు ఇప్పడు కష్టమొచ్చింది. ఒకప్పుడు డూప్ లతో సరిపెట్టుకున్నారు. కానీ కాలం మారింది. డూప్ లను ఉపయోగించినా ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టేస్తున్నారు.

పైగా 60 ఏజ్ వెంటపడినా తెరపై కనిపించాలంటే వారి వయసు కనిపించకూడదు. అంటే అందుకు తగ్గట్టుగా కసరత్తులు చేయాలి. ముఖంపై ముడతలు కనిపించకుండా గ్రాఫిక్స్ చేయోచ్చు కానీ బాడీ షేపులు మాత్రం మెయింటెయిన్ చేయాల్సిందే కాబట్టి హీరోలంతా జిమ్ముల్లో కఠోరంగా శ్రమిస్తున్నారు. చిరంజీవి – బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున వీళ్లంతా రెగ్యులర్ గా జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నారు. చిరు ఏజ్ 60 ప్లస్. అయినా పోటీలో నిలబడాలంటే శ్రమించక తప్పదని తెలుసుకుని వర్కవుట్ లు చేస్తూ బరువు తగ్గించుకుంటున్నారు. నాగార్జునకు ఈ ఆగస్టులో 60 వచ్చింది. ఆయినా వర్కవుట్లు చేస్తూ నవమన్మధుడిని తలపిస్తున్నారు. `మన్మథుడు-2` కోసం నాగార్జున విదేశాల్లోనూ కసరత్తులు చేస్తూ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ యుక్తవయసులో రెగ్యులర్ జిమ్ చేసేవారు. ఇటీవల ఏజ్ దృష్ట్యా వాకింగ్ .. ధ్యానంతో మేనేజ్ చేస్తున్నారట.

నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా 60కి చేరువయ్యారు. 59 ఏళ్ల వయసులో ఆయన రీబూట్ అయ్యి కసరత్తులు మొదలుపెట్టారు. బోయపాటి సినిమా కోసం ఏకంగా 25 కేజీలు తగ్గడానికి చాలానే శ్రమిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ 55 ప్లస్కొచ్చారు. ఆయన కూడా పోటీలో వుండాలంటే కసరత్తులు తప్పలేదు. మెడిటేషన్.. వివేకానందుని ఫాలోవర్ గా ఆయన శైలి ఇతర హీరోల కంటే విభిన్నం. అదే ఆయన ఆరోగ్యానికి పెద్ద ప్లస్. అయితే మోహన్బాబు రెగ్యులర్ వాకింగ్ జాగింగ్ తో హెల్దీగా ఉన్నారు. జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక భానుచందర్.. సుమన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ తొలి నాళ్ల నుంచే వారిది మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం. నిత్యం కసరత్తులు చేస్తూనే వుంటారు. వీరిని మినహాయిస్తే ఈ వయసులో 60 ప్లస్ హీరోలకు ఈ కష్టమేల అంటున్నారు.
Please Read Disclaimer