కియారా ‘హసీనా పాగల్’ వీడియో సాంగ్ రిలీజ్.. కాపీ అంటున్నారే…!

0

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయరామ’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కియారా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఇందూ కీ జవానీ”. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అభీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. మికా సింగ్ సంగీతం సమకూరుస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కాగా ‘హసీనా పాగల్ దివాని..’ అంటూ సాగే ఈ పెప్పీ సాంగ్ ని మికా సింగ్ – ఆసిస్ కౌర్ ఆలపించారు. ఈ సాంగ్ లో కియారా హాట్ లుక్స్ మరియు క్యూట్ స్టెప్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో కియారాతో పాటు హీరో ఆదిత్య సియల్ కూడా కనిపిస్తున్నాడు. అయితే ‘హసీనా పాగల్ దివాని..’ సాంగ్ ట్యూన్ మన తెలుగు సినిమా నుంచి కాపీ కొట్టి మనల్ని పాగల్స్ ని చేస్తున్నారంటూ తెలుగు వీక్షకులు ట్రోల్ చేస్తున్నారు. రవితేజ – పూరీ కాంబోలో వచ్చిన ‘ఇడియట్’ సినిమాలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే…’ అనే సాంగ్ ని పోలి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇడియట్’ చిత్రానికి దివంగత చక్రి మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి మికాసింగ్ ‘హసీనా పాగల్ దివాని..’ పాటను తన సొంత ఆల్బమ్ ‘సాన్ మెయిన్ లాగ్ గయీ ఆగ్’ కు న్యూ వర్షన్ గా తీసుకొచ్చాడు. 1998లో రిలీజైన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. అయితే ఇదే ట్యూన్ ని స్ఫూర్తిగా తీసుకొని సంగీత దర్శకుడు చక్రి 2002లో వచ్చిన ‘ఇడియట్’ సినిమాలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే…’ సాంగ్ గా మలిచాడు. అప్పట్లో సోషల్ మీడియా యూట్యూబ్ ప్రభావాలు లేకపోవడం వల్ల ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియలేదు. అయితే ఈ విషయం తెలియని కొంతమంది ఆడియన్స్ తెలుగు సాంగ్ ట్యూన్ ని హిందీ కంపోజర్ కాపీ కొట్టాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు.