బిగ్ బాస్ హౌస్ కి.. ప్రెగ్నెన్సీ టెస్ట్ కు లింకేంటి?

0

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తొలి వారంలోనే తిరిగి వచ్చారు నటి హేమ. తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆమె.. బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో.. ఆ షోకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందరి మీదా అధిపత్యం చెలాయించారని.. ఆమె ప్రవర్తన నచ్చన హౌస్ మేట్స్ అందరూ కలిసి హేమను బయటకు పంపారని.. వీక్షకులకు సైతం ఆమె తీరు నచ్చలేదన్న మాట వినిపించింది.

ఈ విమర్శలతో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని గమనించిన హేమ.. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. షోకు సంబంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. తానెక్కడా తప్పు చేయలేదని.. గేమ్ లోకి వెళ్లక ముందే తాను బయటకు వచ్చేసినట్లుగా వ్యాఖ్యానించారు. తాను చాలా సెన్సిటివ్ పర్సన్ గా అభివర్ణించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎదురైన ఇబ్బందిని చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ విషయంలో శ్వేతారెడ్డిది తప్పని తాను అనుకోవటం లేదన్నారు. తనకు అన్యాయం జరిగిన వెంటనే ఫైట్ చేస్తే బాగుండేదన్నారు. బిగ్ బాస్ సెలక్షన్స్ కు సంబంధించి తనకు ఎదురైన ఒక విషయాన్ని వెల్లడించారు. తనను సెలక్షన్స్ టైమ్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమని చెప్పినట్లు చెప్పారు. తాను చేయించుకొని ఇచ్చినట్లు చెప్పారు. ఈ టెస్ట్ రిపోర్ట్ అడగటానికి కారణం లేకపోలేదని.. తనకు పెళ్లైందని.. ఒక వేళ ప్రెగ్నెంట్ అయితే ఇతర సభ్యులకు తెలిసే అవకాశం లేదు. గేమ్ లో భాగంగా కిందపడి అబార్షన్ అయితే బిగ్ బాస్ వాళ్లనే అంటరు కదా.. అందుకే అలా అడిగారన్నారు. తన కుమార్తె బీబీఏ రెండో సంవత్సరం చదువుతుందన్నారు.

తన కుమార్తెకు ఇంటి బాధ్యతలు అప్పగించిన తర్వాతే రాజకీయాల్లోకి వెళతానని చెప్పారు. ఈ లోపు తాను తినాల్సిన దెబ్బలు చాలానే ఉన్నాయని చెప్పిన హేమ.. తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్పేశారని చెప్పాలి. ఇంటి సభ్యుల మనసుల్ని దోచుకోలేకపోయిన హేమ.. ప్రజల మనసుల్ని దోచుకునే ఛాన్స్ ఉందా? లాంటి సందేహాల్ని వ్యక్తం చేయటం తొందరపాటే అవుతుందేమో?

బిగ్ బాస్ హౌస్ లోని హౌస్ మేట్స్ అందరూ.. తన కంటే వయసులో పదేళ్లు చిన్న వారని.. వాళ్లను తాను తిట్టలేనని.. అదే సమయంలో తాను తిట్టించుకోలేనని.. తిడితే చిన్నవాళ్లను హేమ తిట్టిందంటారని.. తిట్టించుకుంటే చిన్నవాళ్ల చేత తిట్టించుకున్నారన్న మాట అంటారన్నారు. తన ఫోకస్ అంతా నాగార్జున మీదే ఉందన్న విషయాన్ని వెల్లడించిన ఆమె.. ఒకానొక దశలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేయటమే మంచిదని తాను అనుకున్నట్లు చెప్పారు.

ఇంటి సభ్యులు తనను అర్థం చేసుకోలేకపోయారని.. షోలో తాను నటించలేదని.. తాను తనలా మాత్రమే ఉన్నానని చెప్పారు. గూగుల్ లో పోలైన ఓట్లు చూస్తే..తాను టాప్ లో ఉన్నానని.. కానీ గత సీజన్ అనుభవంతో హాట్ స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ వేయించారని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తన అభిమానులకు అది అర్థం కాలేదని.. అదే తనకు ఇబ్బందిగా మారిందన్నారు.
Please Read Disclaimer