కోనేరు వారసుడు హీరోగా నిలదొక్కుకునేనా…?

0

ప్రముఖ నిర్మాత కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ తనయుడు కోనేరు హవీష్ లక్ష్మణ్ 2011లో వచ్చిన ‘నువ్విలా’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ఈ సినిమాలో హవీష్ నటనకు మంచి పేరొచ్చింది. ఆ తరువాత ‘జీనియస్’ మరియు ‘రామ్ లీల’ అనే చిత్రాలలో నటించారు హవీష్. అయితే ఈ సినిమాలు పెద్దగా ప్రభావాన్ని చూపలేక పోయాయి. గతేడాది తెలుగు తమిళ భాషల్లో ‘సెవెన్’ అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చినప్పటికీ హవీష్ కి నిరాశే ఎదురైంది.

అయితే కేఎల్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తూనే జయాపజయాలతో సంబంధంలో లేకుండా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు హవీష్. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ గా మారి ‘ఏ హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సినిమాల నిర్మాణం కూడా స్టార్ట్ చేసారు. మొదటి ప్రయత్నంగా తమిళ్ లో సూపర్ హిట్ చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి ‘రాక్షసుడు’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని కమర్షిల్ హిట్ గా నిలిచింది. దీంతో మాస్ మహా రాజా రవి తేజ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేసారు కోనేరు హవీష్.

ఇదిలా ఉండగా ఈ రోజు హవీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం హవీష్ రెండు ప్రాజెక్ట్స్ ఓకే చేశాడట. అందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ కాగా మరొకటి లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా గతేడాది నుండి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం లో హవీష్ సినిమా ఉండ బోతోందని వార్తలు వస్తున్నాయి. హవీష్ లైన్లో పెట్టిన రెండు ప్రాజెక్ట్స్ లో ఇది కూడా ఉందేమో చూడాలి. ఇక హీరోగా నిలదొక్కుకోవాలని పట్టువదలకుండా ట్రై చేస్తున్న కోనేరు వారసుడు హవీష్ కి ఈ రెండు ప్రాజెక్ట్స్ హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ ‘తుపాకీ డాట్ కామ్’ బర్త్ డే విషెస్ తెలియ జేస్తోంది.
Please Read Disclaimer