ఎందుకలా అరుస్తావ్? తమాషాగా ఉందా?

0

అభిమాన తారలు వేదికలపై మాట్లాడేప్పుడు డిస్ట్రబ్ చేయడం ఫ్యాన్స్ కి అలవాటు. పెద్ద స్టార్లకే కాదు.. అప్పుడే డెబ్యూలుగా రంగ ప్రవేశం చేస్తున్న కథానాయికలకైనా ఇలాంటి ఇబ్బంది తప్పదు. ఓవైపు వేదికపై మాట్లాడుతూ ఉంటే మరోవైపు ఫ్యాన్స్ నస పెట్టేస్తారు. విజిల్స్ వేసి గోల గగ్గోలు పెట్టేస్తారు. తడబడితే ఇంకాస్త రెచ్చగొడతారు. దాంతో మాట్లాడేవారికి ఇర్రిటేషన్ తప్పదు. ఇదిగో ఇక్కడ అలాంటి సన్నివేశమే ఆ ఓవర్ ప్రొటెక్టివ్ డాడ్ కం సీనియర్ హీరోకి కోపం తెప్పించింది. కుమార్తె ఓ వైపు ప్రసంగం చేస్తుంటే మధ్యలో ఎవడో గోలగోల చేశాడు. బాగా నస పెట్టేశాడు. దాంతో కోపం వచ్చిన డాడ్ వేదికపై నుంచే గట్టిగా కోటింగ్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఫ్యాన్స్ లో ఇదో హాట్ టాపిక్. ఇంతకీ అలా కోటింగ్ ఇచ్చిన డాడ్ ఎవరు? కుమార్తె ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.

యాంగ్రీ హీరో రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక నటించిన `దొరసాని` చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జీవిత రాజశేఖర్ అన్నీ తానే అయ్యి ప్రమోషన్ యాక్టివిటీస్ ని పర్యవేక్షిస్తున్నారు. తాజా ప్రమోషనల్ ఈవెంట్ లో డెబ్యూ హీరో ఆనంద్ దేవరకొండ సోదరుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ఇదే వేదికపై కథానాయిక శివాత్మిక సోదరి శివానీ కూడా తనదైన ప్రసంగం చేయడం విశేషం. శివానీ ఓవైపు మాట్లాడుతుంటే మరోవైపు అభిమానులు గోల గోల చేశారు. అందులోంచి ఓ గడుగ్గాయ్ మరీ అల్లరి చేశాడు.

దాంతో ఆ పక్కనే ఉన్న రాజశేఖర్ కి ఫుల్ గా కోపం వచ్చేసింది. ఏయ్ బాబూ ఎందుకలా అరుస్తున్నావు? అంటూ రాజశేఖర్ నేరుగా అరిచే కుర్రాడి వైపు సీరియస్ గానే చూశారు. “నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు!“ అంటూ శివానీ ఎంతో తమాషాగా ఆ సన్నివేశంలో నవ్వులు పూయించారు. ఆ క్రమంలోనే రాజశేఖర్ శివానీ చేతిలోని మైక్ లాక్కుని .. దేవరకొండ బ్రదర్స్ పై ట్రోలింగ్ గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. “విజయ్ దేవరకొండ- ఆనంద్ దేవరకొండ బ్రదర్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.. అది నాకు నచ్చలేదు. అసలు సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి నాకు తెలీనే తెలీదు. నేను చూడనే చూడను!“ అంటూ మొత్తానికి బ్రదర్స్ ఇద్దరినీ వెనకేసుకొచ్చారు.

ఇక పదే పదే శివానీ స్పీచ్ ని డిస్ట్రబ్ చేస్తున్న అభిమానులపై రాజశేఖర్ కాస్తంత సీరియస్ అవ్వడం చర్చకొచ్చింది. “ఏయ్ బాబూ ఏం తమాషాగా ఉందా?“ అంటూ ఆ గోల చేసే గడుగ్గాయ్ ని రాజశేఖర్ ప్రశ్నించారు. అయితే ఫ్యాన్స్ ఇలాంటి వేదికల వద్ద అరవడం సహజమే. సెలబ్రిటీలు సీరియస్ అవ్వడం సహజమే. అయితే ప్రతిదీ లైఫ్ లో పార్ట్ అని అనుకోవాలేమో! ఇక ఈ వేదికపై చెల్లెలు శివాత్మిక సినిమాని ఆకాశానికెత్తేసిన శివానీ.. దొరసాని మూవీని తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ ఎంతగా శ్రమించిందో.. దర్శకనిర్మాతలు పరిమిత వనరులతో ఎలాంటి సాహసాలు చేశారో కళ్లకు కట్టినట్టు వర్ణించారు. ఆనంద్ దేవరకొండ- శివాత్మిక జంటగా నటించిన దొరసాని ఈనెల 12న (గురువారం) రిలీజవుతోంది. దొరసానిలో సత్తా ఎంతో తేలేది ఆరోజే.
Please Read Disclaimer