ఈసారి సంతృప్తిగా ఉన్న ‘వర్మ’ ఫాదర్

0

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ఇప్పటికే బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. దాదాపుగా 225 కోట్ల వసూళ్లను ఇప్పటి వరకు రాబట్టింది. ఈ సమయంలోనే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ‘ఆధిత్య వర్మ’ గురించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. తమిళ అర్జున్ రెడ్డి ని ఇప్పటికే ఒకసారి తెరకెక్కించి దాన్ని మొత్తం తొలగించారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న దృవ్ తండ్రయిన హీరో విక్రమ్ కు బాలా తెరకెక్కించిన ఫుటేజ్ ఏమాత్రం నచ్చలేదట. దాంతో దాన్ని పూర్తిగా తొలగించారు.

అర్జున్ రెడ్డికి సహాయ దర్శకుడిగా పని చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ‘వర్మ’ను కాస్త ‘ఆధిత్య వర్మ’గా మార్చి మళ్లీ మొత్తం రీ షూట్ చేశారు. ఆధిత్య వర్మ ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. దృవ్ ఈ చిత్రానికి కేవలం మూడు రోజుల్లో డబ్బింగ్ చెప్పడం విక్రమ్ కు ఆశ్చర్యంను కలిగించిందట.

దృవ్ ఈ చిత్రంలో చాలా బాగా నటించాడని తప్పకుండా ఇది తనకు బెస్ట్ ఎంట్రీ అవుతుందని విక్రమ్ తాజాగా ఒక కార్యక్రమంలో అన్నాడు. ఎమోషనల్ సీన్స్ లో దృవ్ యాక్టింగ్ సూపర్బ్ గా ఉందంటూ ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆధిత్య వర్మ’ చిత్రంపై తమిళ సినీ వర్గాల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కబీర్ సింగ్ సక్సెస్ తో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రం దృవ్ కెరీర్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందనేది చూడాలి.
Please Read Disclaimer