బర్త్ డే చేసుకోని ఆ హీరోయిన్?

0

సినిమా ఇండస్ట్రీలో హీరో.. హీరోయిన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారి సినిమాలు విడుదలయ్యే వేళలో ఫ్యాన్స్ చేసే హడావుడి భారీగా ఉంటుంది. ఇక.. పుట్టినరోజులు లాంటివి వస్తే హంగామా ఒక రేంజ్లో ఉంటుంది. అందుకే.. అభిమాన నటీనటుల పుట్టినరోజుల్ని గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు అభిమానులు. కానీ.. ఒక టైంలో ఒక వెలుగు వెలిగిపోయి.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నాటి హీరోయిన్ రాశి.

ఆమెకు పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదని చెప్పేశారు. హీరోయిన్ గా పీక్స్ లో ఉన్నప్పటికి బర్త్ డేలకు మాత్రం దూరంగా ఉండేవారు. ఎందుకన్న విషయం మీద ఇప్పటివరకూ కారణం బయటకు వచ్చింది లేదు. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను పుట్టినరోజును ఎందుకు చేసుకోనో చెప్పుకొచ్చారు.

పుట్టినరోజు అంటే అందరి మాదిరి తనకూ సరదా అని.. కానీ తన 18వ పుట్టినరోజు చాలా విషాదకరంగా సాగిందని.. దాంతో బర్త్ డే చేసుకోవటం మానేసినట్లు చెప్పారు. సాధారణంగా తన పుట్టినరోజుకు ముందురోజు అర్థరాత్రి 12 గంటల సమయంలో తన తండ్రి నిద్ర లేపి విషెస్ చెబుతారని.. కానీ తన 18వ పుట్టినరోజుకు మాత్రం ఆయన అలా చేయలేదన్నారు.

ఆ బర్త్ డే వేళలో తాను షూటింగ్ లో ఉన్నట్లు చెప్పిన రాశి.. తండ్రి ఫోన్ చేయని విషయాన్ని అన్నయ్యకు చెబితే.. సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతాం కదా? అప్పుడు చెబుతార్లేనని చెప్పారన్నారు. సాయంత్రానికి ల్యాండ్ లైన్ కు ఫోన్ వస్తే.. తన తండ్రే ఫోన్ చేశారని అనుకున్నానని..కానీ తన తండ్రి మరణించిన సమాచారం తన అన్నకు తెలియజేయటం కోసం ఫోన్ చేశారన్నారు. దీంతో.. అప్పటి నుంచి తన పుట్టిన రోజును జరుపుకోవటమే మానేసినట్లు ఆమె చెప్పారు. నిజంగానే.. ఎంత విషాదమో కదా?
Please Read Disclaimer