టాప్ స్టోరి: దురదృష్ణ నాయికలు

0

ఇంటిని వెతుక్కుంటూ వచ్చే అదృష్టలక్ష్మిని కాలదన్నుకుంటే ఆ ఫలితం అనుభవించాల్సిందే. టాలీవుడ్ లో అలా వెంటపడి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్న నాయకానాయికలు చాలా మందే వున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కాలం కలిసి రాక కొందరు.. కథను జడ్జి చేయలేక మరికొందరు.. అంచనా వేయడంతో ఇంకొందరు.. చివరికి తమవద్దకు వచ్చిన ఆఫర్లను కాలదనుకున్న సందర్భాలున్నాయి. జాతకరీత్యా దురదృష్ణవంతులు చాలా మందే వున్నారు. ముఖ్యంగా పలువురు కథానాయికలు ఈ తరహాలో అదృష్టాన్ని కాలదన్నుకుని దురదృష్ట దేవతలనిపించుకున్నారు.

`రంగస్థలం` లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో అవకాశం దక్కితే కాలదన్నుకుంది అనుపమ పరమేశ్వరన్. ఇందులో రామలక్ష్మి పాత్ర తను చేయాల్సినదే. కానీ దురదృష్టం వెంటాడింది. ఆ ఛాన్స్ అక్కినేని కోడలు సమంతను వెతుక్కుంటూ వెళ్లి బోలెడంత పేరు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఆ అవకాశం ముందు వరించింది అనుపమనే అయినా టైమ్ బ్యాడ్. డేట్స్ సమస్య అంటూ తన దాకా వచ్చిన ఆఫర్ ని కాదనుకుందని ప్రచారమైంది.

`ఎవడు` సినిమా సమంత చేయాల్సింది. డేట్స్ సమస్య వుందని సామ్ తప్పుకోవడంతో ఆ అవకాశం శృతిహాసన్ ని వరించింది. గబ్బర్ సింగ్ తర్వాత ఎవడుతో మరోసారి అదృష్ట నాయిక అయ్యింది శ్రుతి. ఇక ఇదే శ్రుతి ఊపిరి చిత్రంలో నటించాల్సింది. అప్పట్లో నిర్మాత పీవీపీతో గొడవ వల్ల చివరి నిమిషంలో తప్పుకుంది. దాంతో ఆ పాత్రలోకి తమన్నా పరకాయ ప్రవేశం చేసి లక్కీ గాళ్ అనిపించుకుంది. ఊపిరి బ్లాక్ చక్కని విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ `గీత గోవిందం`లో నాయికగా నటించే అవకాశం రకుల్ ప్రీత్సింగ్- లావణ్య త్రిపాఠి- అను ఇమ్మాన్యుయేల్ లాంటి నాయికల్ని వెతుక్కుంటూ వెళ్లింది. కానీ ఆ ముగ్గురూ కాలదన్నుకుని దురదృష్ట దేవతలయ్యారు. చిన్న హీరోతో సినిమా అన్న కారణంతో లావణ్య.. రకుల్ ఆ ఛాన్స్ ని వదులుకున్నారు. అను ఇమ్మాన్యుయేల్ మాత్రం గెస్ట్ పాత్రలో నటించింది. కానీ సక్సెస్ క్రెడిట్ ని మాత్రం రష్మిక ఎగరేసుకుపోయింది.

`అర్జున్ రెడ్డి` బాలీవుడ్ రీమేక్ `కబీర్ సింగ్`లో కియారా అద్వానీ నటించింది. కానీ తొలుత ఆ స్థానంలో అప్ కమ్ నాయిక తారా సుతారియాను అనుకున్నారు. చివరి నిమిషంలో ఆ స్థానంలోకి కియారా అద్వానీ వచ్చి చేరింది. దీంతో తారా అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఛాన్స్ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తమ కెరీర్ కి పూల బాట వేసుకోవాల్సిన తారలు తమ దురదృష్టంతో ఆ గోల్డెన్ ఛాన్స్ ని చేజేతులా వదులుకోవాల్సి రావడం విచిత్రమే. అయితే ఇక్కడొక విషయం చెప్పాలి. హిట్ సినిమా ఏది.. మంచి పాత్ర ఏది? అన్నది అంచనా వేయడంలో విఫలం కావడం వల్లే వీళ్లంతా అవకాశాలు కోల్పోయారు. కాల్షీట్ల సమస్య అన్నది మ్యానేజబుల్ అయినా కాలదన్నుకున్న వారే ఎక్కువ. అంచనా వేయడంలోనే అదృష్టం .. అంచనా వైఫల్యంలోనే దురదృష్టం దాగి ఉన్నాయని వీళ్ల విషయంలో ప్రూవ్ అయ్యింది.
Please Read Disclaimer