బెల్లంకొండకు కోర్టు బ్యాండ్ బాజా

0

కాపీ రైట్స్ వ్యవహారంలో ఓ కేసు విషయమై దిల్లీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్ – సమంత జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన `జబర్థస్త్` 2013లో విడుదలైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా కథాంశంపై కాపీ రైట్స్ వివాదం తలెత్తింది. జబర్థస్త్ కథను బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `బ్యాండ్ బాజా బరాత్` నుంచి కాపీ కొట్టారని ప్రచారమైంది. ఆ ప్రచారం అనంతరం యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ `జబర్థస్త్` మేకర్స్ పై కోర్టులో పిల్ వేసింది. బ్యాండ్ బాజా బరాత్ (2010) చిత్రాన్ని తెలుగు-తమిళంలో రీమేక్ చేయాలని భావించిన యశ్ రాజ్ సంస్థకు `జబర్థస్త్` పెద్ద షాక్ ని ఇచ్చిందన్న వాదన ప్రధానంగా చర్చకువ వచ్చింది. బ్యాండ్ బాజా కథను.. అందులో పాత్రల్ని నందిని రెడ్డి యథాతథంగా కాపీ చేసి జబర్థస్త్ చిత్రాన్ని తెరకెక్కించారని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా ఈ కేసు విషయమై దిల్లీ కోర్టు తుది తీర్పు సంచలనమైంది.

జబర్థస్త్ సినిమా అనధికారిక రీమేక్. కథాంశం కాపీ చేసినదేనని కోర్టు తీర్పునిచ్చింది. జబర్థస్త్ సినిమాకి సంబంధించి డీవీడీ-వీసీడీ రైట్స్ .. బ్లూ రే హక్కులపై బెల్లంకొండకు చెందిన శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ కి హక్కు లేదు. బుల్లితెరపైనా జబర్థస్త్ సినిమాని ప్రదర్శించకూడదని కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2013లో మొదలైన కాపీ క్యాట్ వివాదానికి తాజాగా దిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుతో తెరపడినట్టయ్యింది.

రణ్ వీర్సింగ్- అనుష్కశర్మ జంటగా `బ్యాండ్ బాజా బారాత్` రీమేక్ రైట్స్ తో పని లేకుండానే దర్శకరచయితలు ఆ కథను కాపీ కొట్టారనే వాదనను యశ్ రాజ్ సంస్థ వినిపించింది. సదరు సంస్థ వినిపించిన వాదనతో ఏకీభవించి కోర్టు జబర్ధస్త్ మేకర్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాపీ రైట్ చట్టాల ఉల్లంఘన నేరంగా ఈ కేసును పరిగణించి తీర్పును వెలువరిస్తున్నామని కోర్టులో జస్టిస్ మన్మోహన్ వ్యాఖ్యానించారు.
Please Read Disclaimer