టాలీవుడ్ కి హాలీవుడ్ ముప్పు ఆపేదెలా?

0

టాలీవుడ్ కి అనువాద చిత్రాల నుంచి ఎదురవుతున్న ప్రమాదం గురించి తెలిసిందే. మన సినిమాలకు ధీటుగా డబ్బింగులు దూసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగు సినిమాలతో పాటు హాలీవుడ్ నుంచి భారీ సూపర్ హీరో చిత్రాలు.. యానిమేషన్ 3డి చిత్రాలు దండీగా కలెక్షన్లు గుంజుకెళుతున్నాయి. ఇండియా మార్కెట్ తో పాటు తెలుగు రాష్ట్రాల మార్కెట్ ని క్యాప్చుర్ చేస్తూ హాలీవుడ్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ పరిణామం పర్యవసానంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినా హాలీవుడ్ డబ్బింగుల దూకుడు ఎంతమాత్రం తగ్గడం లేదు. ఇటీవల అవెంజర్స్ సంచలనాల గురించి తెలిసిందే. అంతకుముందు ఆక్వామేన్.. బ్లాక్ పాంథర్.. జంగిల్ బుక్ ఒకటేమిటి ఎన్నో సినిమాలు మన జేబులు ఖాళీ చేసి ఉన్నదంతా దోచుకెళ్లాయి. సీనియర్లలో అమితాబ్.. మోహన్ లాల్.. యంగ్ హీరోలు రానా.. నాని సహా పలువురు సౌత్ నార్త్ స్టార్లు డిస్నీ.. ఎంసీయూ సినిమాలకు డబ్బింగులు చెబుతూ బోలెడంత ఎంకరేజ్ చేయడంతో అవి కాస్తా ఇండియాలో పెద్ద ఎత్తున వసూళ్లను కొల్లగొట్టాయి.

ఇప్పుడు మరోసారి అదే తీరుగా మరిన్ని భారీ యాక్షన్ చిత్రాలు.. విజువల్ గ్రాఫిక్స్.. యానిమేషన్ కేటగిరీ చిత్రాలు స్టార్ వాయిస్ కలరింగుతో రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. ఇటీవల ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ నటించిన `టెర్మినేటర్ 6` (డార్క్ ఫేట్) తెలుగులోకి అనువాదమై రిలీజైంది. దీనికి లోకల్ డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్ వినిపించింది. అలాగే లేటెస్టుగా యానిమేషన్ మూవీ `ఫ్రోజెన్ 2`కి రింగుల జుత్తు సుందరి నిత్యామీనన్ వాయిస్ అందిస్తుండడంపై ఫ్యాన్స్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఫ్రోజెన్ లో నిత్యా గొంతు వినిపించనుంది అంటే అది బాక్సాఫీస్ కలెక్షన్స్ కి బూస్టప్ కి సాయం అవుతుందనడంలో సందేహం లేదు. కేవలం ఈ సినిమానే కాదు.. మునుముందు మరిన్ని భారీ హాలీవుడ్ చిత్రాలు తెలుగు లో రిలీజ్ కానున్నాయి. డిసెంబర్ లో డ్వేన్ జాన్సన్ `జుమాంజి-ది నెక్ట్స్ లెవల్` .. స్టార్ వార్స్- ది రైజ్ ఆఫ్ స్కైవాల్` లాంటి చిత్రాలు తెలుగు అనువాదాలతో దూసుకొస్తున్నాయి. 2020లోనూ భారీగా హాలీవుడ్ చిత్రాలు క్యూ కట్టనున్నాయి.

అసలు హాలీవుడ్ అనువాద చిత్రాలు టాలీవుడ్ కి మేలు చేస్తున్నాయా.. కీడు చేస్తున్నాయా? స్టార్ హీరోల రేంజు ఓపెనింగులతో భారీగా వసూళ్లను కొల్లగొడుతున్న ఈ చిత్రాలు ఇకపైనా భారీగా రిలీజ్ కి వస్తున్నాయంటే ఆ మేరకు పోటీ పెరిగినట్టా కాదా? ఇది మంచికా చెడుకా? అన్నది పరిశ్రమ వర్గాలే విశ్లేషించాలి. సరిహద్దులు దాటి తెలుగు సినిమా వెళుతోంది కదా.. పాపం హాలీవుడ్ ని బతకనిస్తే తప్పేం కాదని సరిపెట్టుకోవాలా!
Please Read Disclaimer