హిట్టు అనే ఒయాసిస్సును కనిపెట్టేదెలా?

0

అఖిల్ సాహసం గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు ఎంచుకుంటున్న దర్శకులే ఒక సాహసం అనుకుంటే ప్రతిసారీ ఆ సాహసం మిస్ ఫైర్ అవుతూనే ఉంది. వీవీ వినాయక్ లాంటి మాస్ దర్శకుడితో ఊహించని ఎంట్రీ అతడికి పెద్ద మైనస్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతా విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో హలో.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను చిత్రాలు ఊహించని ఫ్లాపులుగా నిలిచాయి. ఈ పరిణామాన్ని అతడు జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది. అందుకే నాలుగో సినిమాని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. అయితే ఈసారి కూడా మరో డిజాస్టర్ దర్శకుడికి అవకాశం ఇచ్చి సాహసం చేశాడు. వరుసగా మూడు నాలుగు ఫ్లాపులతో తెరమరుగైన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి ఛాన్సు ఇవ్వడంపై అక్కినేని అభిమానుల్లో సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇది కచ్ఛితంగా సాహసమే అంటూ ముచ్చటించుకుంటున్నారు.

అయినా మొండి పట్టుదలతో స్క్రిప్టును నమ్మి అఖిల్ -భాస్కర్ బృందం ముందుకెళ్లారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ సాహసాలు కంటిన్యూ అవుతున్నాయనే తెలుస్తోంది. చెట్టు పుట్ట అన్నవే కనిపించని ఓ భీకరమైన ఎడారిలోకి అఖిల్ బృందం వెళ్లిందట. అది సౌదీ అరేబియా ఎడారి. అక్కడ 10 రోజుల పాటు ఓ కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఒక ఫైట్ ని ఒక పాటను ఇక్కడ చిత్రీకరించనున్నారట.

రిలీజ్ తేదీ విషయంలో ఎంతా పక్కాగా ఉండే అక్కినేని కాంపౌండ్ ఈ చిత్రాన్ని 2020 ఉగాది కానుకగా మార్చి లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఉగాది సెలవు లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా చూసి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయిక. ఎడారిలో షూటింగ్ అంటే సాహసమే. అఖిల్ కి ఇదో కొత్త అనుభవం. అఖిల్ చిత్రాన్ని ఓ డీప్ ఫారెస్ట్ లో కీలక భాగం తెరకెక్కించారు. అలాగే హలో చిత్రాన్ని ఖరీదైన నగరాల్లో మెజారిటీ భాగం చిత్రీకరించారు. ఇప్పుడు ఎడారిలో అద్భుతమైన ఎపిసోడ్ తీస్తున్నారు నాలుగో సినిమా కోసం. మరో విజువల్ రిచ్ సినిమాలో అఖిల్ నటిస్తున్నాడని అర్థమవుతోంది. మరి ఈ సాహసం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? అన్నది చూడాలి.
Please Read Disclaimer