వైల్డ్ డాగ్ డిజిటల్ రిలీజ్ నిజం ఎంత?

0

నాగార్జున హీరోగా సాల్మన్ రూపొందుతున్న వైల్డ్ డాగ్ మూవీ విడుదలకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. దియా మీర్జా మరియు సయామీ ఖేర్ లు కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా ను డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద విడుదల చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాని కారణంగా ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా షూటింగ్ పూర్తి అవ్వడంతో మళ్లీ డిజిటల్ రిలీజ్ వార్తలు జోరందుకున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నెట్ ప్లిక్స్ వారు ఈ సినిమాను పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తంకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారట. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఇచ్చేందుకు సిద్దం అయిన నెట్ ప్లిక్స్ వారికి సినిమాను ఇచ్చే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

థియేటర్లు పునః ప్రారంభం అయిన ఈ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో వైల్డ్ డాగ్ ను విడుదల చేయాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. నాగార్జున వంటి స్టార్ హీరోలు ఓటీటీ విడుదలకు వెళ్లడం అనేది థియేటర్లకు అన్యాయం చేసినట్లు అవుతుందంటున్నారు. అందుకే వైల్డ్ డాగ్ సినిమాను ఓటీటీలో విడుదల చేయక పోవచ్చు అని.. థియేటర్ల ఓపెన్ విషయంలో కేసీఆర్ తో చర్చించిన నాగార్జున తన సినిమాను ఓటీటీలో ఎలా విడుదల చేస్తాడని భావిస్తున్నారు అంటూ అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది నిజం అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.