రోడ్డు మీద అప్పడాలు అమ్మిన సూపర్ హీరో!

0

ఇమేజ్ చట్రంలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు బాలీవుడ్ అగ్రతారలు. హీరో అంటే ఇలానే ఉండాలన్న పరిధుల్ని దాటేస్తున్న వారు.. పాత్రలో మమేకం అయ్యేందుకు తెగ కష్టపడుతున్నారు. వెండితెర మీద కండలు తిరిగిన దేహం. ఉక్కుకు ప్రతిరూపమన్నట్లుగా ఉండే ఆకారంతో అందరిని అలరిస్తూ..బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరోగా పేరున్న హృతిక్ రోషన్ తన తాజా చిత్రం కోసం ఎంతలా మారాడన్నది తాజా లుక్ చూస్తే ఆశ్చర్యపోవటం ఖాయం.

మాసిన గడ్డం..తెల్ల వెంట్రుకలతో.. సాదాసీదాగా.. పేదరికంతో కిందా మీదా పడే కోట్లాది మంది మాదిరి అచ్చుగుద్దినట్లుగా ఉన్న హృతిక్ తాజా పాత్ర పుణ్యమా అని అతడు నటిస్తున్న సూపర్ 30 మీద అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం సూపర్ 30.

వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బీహార్ కు చెందిన గణిత శాస్త్రవేత్త రూపంలో ఒదిగిపోయారు హృతిక్. తనకున్న సూపర్ హీరో ఇమేజ్ మొత్తాన్ని పక్కన పెట్టేసిన అతగాడు.. ఈ సినిమాలో భాగంగా రోడ్డు మీద అప్పడాలు అమ్మటం విశేషం. ఇందుకు సంబంధించిన తాజా పోస్టర్ ను విడుదల చేశారు.ఈ పోస్టర్ చూస్తున్నంతనే ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.

ఆనంద్ కుమార్ జీవితంలో అప్పడాలు అమ్మే నాటి పరిస్థితులు చాలా ఉద్వేగపూరితమని.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న అతడు.. జీవితంలో కష్టపడి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న వైనాన్ని వివరిస్తున్నారు హృతిక్. ఒక సాదాసీదా పాత్ర కోసం తనను తాను మార్చేసుకున్న హృతిక్ ను చూస్తే.. సరికొత్తగా కనిపిస్తున్నారని చెప్పక తప్పదు.
Please Read Disclaimer