2020 సంక్రాంతి బెట్టింగ్ 400 కోట్లు

0

2019 కి టాటా చెప్పి 2020కి వెల్ కం చెప్పేందుకు అంతా రెడీ అవుతున్నారు. పట్టుమని 30 రోజులే ఉంది. ఈ నెలలో నాలుగు శుక్రవారాల్లో అదిరిపోయే ట్రీటిచ్చేందుకు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 13.. డిసెంబర్ 20.. డిసెంబర్ 25 తేదీల్ని పలు భారీ చిత్రాలు లాక్ చేసాయి. వెంకీమామ-దబాంగ్ 3- స్టార్ వార్స్ లాంటి చిత్రాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. అలాగే 2019 క్రిస్మస్ కానుకగా భారీ బెట్టింగ్ నడుస్తోంది.

అయితే కొత్త సంవత్సరంలో సంక్రాంతి పందెం ఏ రేంజులో ఉండబోతోంది? అంటే .. మార్కెట్ గణాంకాల్ని పరిగణిస్తే దాదాపు 400-500 కోట్ల మేర బెట్టింగ్ నడవనుందని అర్థమవుతోంది. 2020 సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి. జనవరి 9 మొదలు ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు క్యూ కడుతున్నాయి. తొలిగా రజనీ దర్బార్ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏకంగా 80 కోట్ల మేర బిజినెస్ చేస్తుందని భావిస్తున్నారు. రజనీ చిత్రానికి తమిళంలో విపరీతమైన క్రేజు ఉన్నా.. తెలుగులో మాత్రం అంతంత మాత్రమే. ఇక్కడ బిజినెస్ స్థాయి తక్కువగా ఉంటుంది.

ఇక ఆ తర్వాత జనవరి 11న వస్తున్న అల వైకుంఠపురములో.. జనవరి 12న వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రాలకు భారీ బడ్జెట్లు కేటాయించారు. అందుకు తగ్గట్టే దాదాపు 150 కోట్ల బిజినెస్ చేసే సామర్థ్యం మహేష్.. బన్ని సినిమాలకు ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా హైప్ నెలకొంది. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా చిత్రానికి 30 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దిల్ రాజు ఈ సినిమాకి పక్కా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇలా వీటన్నిటినీ కలుపుకుంటే 400-500 కోట్ల మేర బిజినెస్ సాగే వీలుందని అంచనా వేస్తున్నారు. అంత బిజినెస్ అంటే అన్ని సినిమాలు బాగా ఆడి అంతకు రెట్టింపు గ్రాస్ ని వసూలు చేయాల్సి ఉంటుందన్నమాట.
Please Read Disclaimer