పేరుకేమో 12 సినిమాలు కానీ

0

ఒకే రోజు రెండు మూడు స్ట్రెయిట్ సినిమాలో డబ్బింగ్ మూవీసో రిలీజ్ అయితేనే ఒకదాని ఎఫెక్ట్ మరొకదాని మీద పడుతుందేమో అని నిర్మాతలు ఆందోళన పడుతున్న రోజులివి. అలాంటిది ఏకంగా 12 సినిమాలు ఒకే రోజు అంటే మాటలా. అలా అని మూవీ లవర్స్ సంబరపడి ఎప్పుడు ఆ డేట్ అని అడగకండి. మ్యాటర్ వేరే ఉంది. ఈ నెల 23 అంటే వచ్చే శుక్రవారం ఒకటి రెండు కాదు ఏకంగా పన్నెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ మీదకు దండయాత్రకు వస్తున్నాయి.

విచిత్రంగా వీటిలో ఒకటి రెండు తప్ప దేని పేర్లు ఇండస్ట్రీ వారికి కూడా సరిగా తెలియదంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అంత దారుణంగా వీటి పబ్లిసిటీని అటకెక్కిస్తున్నారు కనక. కోట్లు ఖర్చుపెట్టి తీయడం ఫస్ట్ కాపీ వచ్చాక ఎంతోకొంత బయ్యర్లకు అంటగట్టి మాయమైపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. దీంతో వీటిని ఫీడింగ్ కోసం హాళ్లలో వేసుకున్న థియేటర్లకు కనీసం కరెంట్ బిల్లు కూడా రాని పరిస్థితి నెలకొంది ఈ మాత్రం దానికి సినిమాలు తీయడం ఎందుకు మాకు అంటగట్టడం ఎందుకని వాళ్ళు వాపోతున్నారు.

ముక్కుమొహం తెలియని హీరో హీరోయిన్లను పెట్టుకోవడం ఇష్టం వచ్చిన స్క్రిప్ట్ లతో హడావిడిగా షూటింగులు చేసేసి దాన్నే జనం మీదకు రుద్దడం ఇదో ఫ్యాషన్ అయిపోయిందని ట్రేడ్ వర్గాలు తిట్టుకుంటున్నాయి. వీటిలో కొన్నింటిని మొహమాటం కోసమో లేదా సదరు డిస్ట్రిబ్యూటర్ తో సత్సంబంధాల కోసమో కొనాల్సి వస్తోందని తీరా చూస్తే మొదటి ఆటకు ఓ వెయ్యి రూపాయలు కలెక్షన్ తీసుకురాలేని దారుణమైన పరిస్థితిలో ఇవి ఉన్నాయని అంటున్నారు. ఒక ఏడాదిలో ఇన్ని సినిమాలు వచ్చాయని కౌంట్ చెప్పుకోవడానికి తప్ప ఇవెందుకు ఉపయోగపడటం లేదు.
Please Read Disclaimer