ఆచితూచి అడుగులేస్తున్న రాజుగారు??

0

టాలీవుడ్ లోని టాప్ లీగ్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. ఒకవైపు సినిమాల నిర్మాణం.. మరోవైపు డిస్ట్రిబ్యూషన్ తో ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారు. అయితే గతంలో ఎప్పుడు చూసుకున్నా ఆయన బ్యానర్ లో తెరకెక్కే చిత్రాలు కనీసం నాలుగైదు సినిమాలు సెట్స్ పైన ఉండేవి. మరో రెండు మూడు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్లో ఉండేవి. కానీ ఈమధ్య మాత్రం అంత జోష్ కనపడడం లేదు.

ప్రస్తుతం రాజుగారి బ్యానర్లో తెరకెక్కుతున్న చిత్రాలు రెండు మాత్రమే సెట్స్ పైన ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళ సూపర్ హిట్ చిత్రం ’96’ రీమేక్. శర్వానంద్ – సమంతా ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు. తమిళ వెర్షన్ దర్శకుడే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్లో మరో చిత్రం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ లతో తెరకెక్కుతున్న ‘V’. ఈ రెండు సినిమాలు తప్ప మరో సినిమా సెట్స్ మీద లేదు.

అయితే దిల్ రాజు ఓ నాలుగు ప్రాజెక్టులను మాత్రం లైన్లో పెట్టాడని.. అవి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయని ప్రచారం సాగుతోంది. డెబ్యూ డైరెక్టర్ శశి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమా అందులో ఒకటి. వెంకటేశ్వర ప్రొడక్షన్స్ సహనిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కాల్సిన ‘పలుకే బంగారమాయెనా’ మరొకటి. అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఐకాన్’ ఇంకొకటి. వీటితో పాటుగా డైరెక్టర్ వీవీ వినాయక్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఒక సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాలన్నీ సెట్స్ పైకి ఇప్పుడప్పుడే వెళ్ళేలా లేవు.

ఆశిష్ రెడ్డి డెబ్యూ ఫిలిం లేట్ అవుతోంది. అల్లు అర్జున్ ‘ఐకాన్’ పట్టలేక్కేందుకు ఇంకా చాలా సమయం ఉంది. నాగ చైతన్య చిత్రం.. వినాయక్ డెబ్యూ హీరో ఫిలిం కూడా సమయం తీసుకుంటాయి. ఈ ప్రాజెక్టులలో అసలు ఏవి పట్టాలెక్కుతాయో ఏవి ఎక్కవో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇదంతా చూస్తుంటే ఫ్లాపుల దెబ్బకు దిల్ రాజు స్లో అయ్యాడేమో అనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన ‘F2’ ఒక్కటే సోలో ప్రొడ్యూసర్ గా రాజుగారి బ్యానర్ లో సూపర్ డూపర్ హిట్. అది తప్ప గత కొంత కాలంగా రిలీజ్ అయిన మిగతా సినిమాలన్నీ నిరాశపరిచినవే. దీంతో రాజుగారు తన కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి ఆడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అది నిజమో కాదో ఈ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్ళేదాన్ని బట్టి మరో మూడు నాలుగు నెలల్లో క్లారిటీ వస్తుంది.
Please Read Disclaimer