జోరు పెంచిన శౌర్య.. వరసబెట్టి సినిమాలు

0

యువ హీరో నాగశౌర్య లాస్ట్ సినిమా ‘నర్తనశాల రిలీజై సరిగ్గా ఈనెల ముప్పైకి ఏడాది అవుతుంది. ఈమధ్య ‘ఓ బేబీ’ వచ్చింది.. సూపర్ హిట్ అయింది కదా అంటారా? అది సమంతా సినిమాగానే చెలామణీ అయింది.. హిట్టు కాస్తా సమంతా ఖాతాలోకే వెళ్ళిపోయింది. ఆ సినిమాను పక్కన పెడితే ఒక యువహీరోకు ఏడాది గ్యాప్ అనేది ఎక్కువ సమయమే. అయితే శౌర్య ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి అన్నట్టుగా సినిమాల మీద సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

ప్రస్తుతం నాగశౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ‘అశ్వద్థామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో నూతన దర్శకుడు రమణతేజ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పీపుల్స్ మీడియా వారు నిర్మించే మరో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు. ఈ రెండు సినిమాలు కాకుండా ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్ సంతోష్ దర్శకత్వంలో ‘పార్థు’ అనే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో సాగుతుందని ఏషియన్ సినిమాస్ సునీల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం.

ఇంతటితో నాగశౌర్య సినిమాల లిస్టు పూర్తి కాలేదు.. తాజాగా శౌర్య మరో ప్రాజెక్టును కూడా ఒకే చేశాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుందని.. సౌజన్య అనే లేడీ డైరెక్టర్ ఈ సినిమాను రూపొందిస్తారని సమాచారం. ఈలెక్కన శౌర్య లిస్టులో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. అంటే వచ్చే ఏడాది వరకూ శౌర్య ఫుల్ బిజీ బిజీ.
Please Read Disclaimer