ఎల్లువొచ్చి గోదారమ్మ.. పాత క్లాసిక్స్ కు మూడిందా?

0

పాత క్లాసిక్ సినిమాల టైటిల్స్ ను వాడడం ఈమధ్య కామన్ గా మారింది. క్రేజ్ కోసం ఆ టైటిల్స్ ను వాడుకుంటున్నారు కానీ వాటిలో మెజారిటీ సినిమాలను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఇక రీమిక్స్ పాటల పరిస్థితి కూడా దాదాపుగా అంతే. ఇప్పటివరకూ ఎన్నో క్లాసిక్ హిట్ సాంగ్స్ ను.. సూపర్ హిట్ అయిన పాటలను మన మేకర్స్ రీమిక్స్ చేశారు. అయితే దాదాపుగా అవేవీ ఒరిజినల్ పాటలోని మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాయి. ఎప్పుడో అరుదుగా కానీ అలా మ్యాజిక్ రిపీట్ కావడం జరగలేదు.

అయితే తాజా ‘గద్ధలకొండ గణేష్’ చిత్రం కోసం హరీష్ శంకర్ ‘సోగ్గాడు’ సినిమాలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాటను రీమిక్స్ చేయడం జరిగింది. ఒరిజినల్ పాటతో పోల్చడం భావ్యం కాదు కానీ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ రీమిక్స్ చేసిన ఈ పాట సూపర్ డూపర్ హిట్ గా మారింది. మొదటిసారి రీమిక్స్ సాంగ్ పై ప్రేక్షకులకు సదభిప్రాయం కలిగేలా చేసింది. ఇక ఈ పాటకు ఆర్ట్ వర్క్.. విజువల్స్..డ్యాన్స్ అన్నీ సూపర్. వరుణ్ తేజ్ సినిమాకు ఇది ఓ హైలైట్ గా మారింది.

అంతా బాగానే ఉంది కానీ ఈ పాట హిట్ కావడంతో కొందరు సంగీత ప్రియులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాట బాగున్నప్పుడు ఆందోళన ఎందుకు అంటారా? మన టాలీవుడ్ మేకర్లకు ఓ అలవాటు ఉంది. ఏదైనా ఒక సినిమాలో ఒక అంశం వర్క్ అయిందంటే ఇక దాన్ని జనాల మొహం మొత్తేవరకూ రుద్దుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ‘సోగ్గాడు’ సాంగ్ ప్లాన్ భలేగా వర్క్ అవుట్ అయింది కాబట్టి ఇప్పటికే పాత సినిమాలలోని క్లాసిక్స్ పాటలపై మన ఫిలిం మేకర్లు కన్నేసి ఉంటారని.. వాటిని వీలైనంత చెడగొట్టడం ఖాయమని భయపడుతున్నారు. ఎందుకంటే అందరూ హరీష్ శంకర్లు కారు.. అందరూ మిక్కీ జే మేయర్లు కారు. అదే సదరు సంగీతప్రియుల ఆందోళన!!
Please Read Disclaimer