అనుష్క, కాజల్‌ను దాటి నా దగ్గరకు వచ్చింది: ఈషా రెబ్బా

0
ప్రస్తుతం ఒక నటికి ఫుల్ లెగ్త్ రోల్ రావడం, అది కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమా కావడం చాలా అరుదని హీరోయిన్ ఈషా రెబ్బా అన్నారు. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్య దేవ్, శ్రీరామ్, ముస్కాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా బుధవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

అనుష్క, కాజల్‌తో కుదరకపోవడంతో..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈషా రెబ్బా మాట్లాడుతూ ‘రాగల 24 గంటల్లో’ సినిమాలో మెయిన్ రోల్ తనకు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ పాత్ర కోసం తనను ఎంపిక చేసుకున్నందుకు దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డికి ఈషా థ్యాంక్స్ చెప్పారు. అనుష్క, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లతో ప్లాన్ చేసుకున్నా కుదరక తనను అప్రోచ్ అయినందుకు చాలా సంతోషించానన్నారు. శ్రీనివాస్‌రెడ్డి లాంటి దర్శకులు ఉన్నారు కాబట్టే ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయని ఈషా వెల్లడించారు.

సత్యదేవ్ టాలీవుడ్ విక్కీ కౌశల్

సత్యదేవ్ చాలా మంచి నటుడని.. ఆయనతో చేస్తున్నప్పుడు తామిద్దరి మధ్య మంచి కాంపిటీషన్ ఫీలింగ్ ఉండేదని ఈషా రెబ్బా చెప్పారు. ఒక మంచి యాక్టర్‌తో చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ కచ్చితంగా ఉంటుందన్నారు. టాలీవుడ్‌కు ఇతనొక విక్కీ కౌశల్ అని కితాబిచ్చారు. ఒక మంచి బ్రేక్ వస్తే సత్యదేవ్ కచ్చితంగా ఎక్కడికో వెళ్లిపోతారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అమేజింగ్ ఆర్ఆర్

థ్రిల్లర్ మూవీ అంటే నేపథ్య సంగీతం చాలా బాగుండాలని, ఈ చిత్ర సంగీత దర్శకుడు రఘుకుంచె అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారని ఈషా రెబ్బా అన్నారు. ఇప్పటికే తాను ఫస్ట్ కాపీ చూశానని, చాలా చాలా బాగుందని చెప్పారు. కొన్ని చోట్ల తనకు గూస్ బంప్స్ వచ్చాయని, దానికి కారణం సంగీతమని వెల్లడించారు. నేపథ్య సంగీతంతో పాటు మూడు పాటలు కూడా అద్భుతంగా ఇచ్చారని కొనియాడారు. ఎప్పుడూ హీరో పేరు మీద సాంగ్ వస్తుందని.. కానీ, ఫస్ట్ టైమ్ హీరోయిన్ పేరిట ఈ సినిమాలో సాంగ్ పెట్టారని చెప్పారు.

కీలక పాత్రలో ‘రోజాపూలు’ శ్రీరామ్

సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు కోలీవుడ్‌కు పరిచయమైన తెలుగు నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్).. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇక గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్, వేణు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ కానూరు ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.