‘పుష్ప’ వార్తలు పుకార్లేనన్న ఆది

0

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న పుష్ప చిత్రంలో కీలక పాత్రకు గాను ఆది పినిశెట్టిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో ఆది మంచి పాత్రలో నటించాడు. సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో పుష్ప చిత్రంలో కూడా ఆయన్ను నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. విజయ్ సేతుపతి నో చెప్పిన పాత్రకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా ఈ విషయమై ఆది క్లారిటీ ఇచ్చాడు. పుష్ప చిత్రంలో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొన్నాడు. పుష్ప చిత్రం కోసం తనను సుకుమార్ గారు సంప్రదించలేదని సన్నిహితుల వద్ద ఆది చెప్పాడట. గతంలో బోయపాటి శ్రీను సరైనోడు చిత్రంలో నటించిన ఆది ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. తెలుగులో హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్న ఆది ఈ చిత్రంలో కూడా నటిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఊహించుకున్నారు. కాని పుష్ప చిత్రంలో లేనంటూ ఆది చెప్పడంతో ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు.

ఆది ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్ లక్ సఖి చిత్రంలో నటిస్తున్నాడు. దాంతో పాటు తమిళంలో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. తెలుగులో మాత్రం ఇంకా కొత్త వాటికి కన్ఫర్మ్ అయినట్లుగా అధికారిక ప్రకటన రాలేదు. ఆది పుకార్లకు చెక్ పెట్టడంతో పుష్పలోని ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎవరు చేస్తారా అంటూ మళ్లీ చర్చ మొదలైంది.