పెద్ద డైరెక్టర్లు తనకు ఛాన్సులు ఇవ్వడం లేదన్న స్టార్ హీరో!

0

బాలీవుడ్ స్టార్ హీరో.. అక్షయ్ కుమార్ ఒకింత సంచలన ప్రకటన చేశాడు. గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ వైవిధ్యభరితమైన సినిమాలే చేస్తున్నాడు. అయితే అవన్నీ కూడా చిన్న సినిమాలు కావడం గమనార్హం! అన్నీ తక్కువ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు మాస్ కు పెద్దగా కనెక్ట్ కాని సినిమాలతో అక్షయ్ కెరీర్ సాగుతూ ఉంది. అయితే అలాగని అతడి సినిమాలు వసూళ్లు సాధించడం లేదని కాదు.

పెద్దగా హడావుడి లేకుండా వచ్చి.. వంద కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లను సాధిస్తున్నాయి అక్షయ్ కుమార్ సినిమాలు. ప్రస్తుతానికి అయితే ఆ హీరో బిజీగానే ఉన్నాడు. సౌత్ లో హిట్ అయిన ‘కాంచన’ సినిమాను అక్షయ్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ ఉన్నాడు. లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతూ ఉంది.

ఈ నేపథ్యంలో బడా బడ్జెట్ సినిమాల్లో ఎందుకు చేయడం లేదంటూ మీడియా అక్షయ్ ను ఆరాతీయగా ఆయన ఆసక్తిదాయకమైన వ్యాఖ్య చేశాడు. ‘నాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఛాన్సులు ఇవ్వడం లేదు..’ అని అక్షయ్ కుండబద్దలు కొట్టాడు.

‘పెద్ద డైరెక్టర్లు ఛాన్సులు ఇవ్వడం లేదు అందుకే చిన్న డైరెక్టర్ల సినిమాల్లో చేస్తున్నా..’ అని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరి వయసు మీద పడిందని అక్షయ్ కు వాళ్లు ఛాన్సులు ఇవ్వడం లేదా..మరేదైనా రీజన్ ఉందా.. అనే విషయాల గురించి అక్షయ్ స్పందించలేదు. తనకు వారు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదనే అంశంపై ఆయన కామెంట్ చేయలేదు!
Please Read Disclaimer