గోవా ఫిలింఫెస్టివల్ లో తెలుగు ట్యాలెంట్

0

గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఇఫీ) ప్రాముఖ్యత తెలిసిందే. ప్రతియేటా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. ఈసారి మన తెలుగు కుర్రాడు తెరకెక్కించిన చిత్రం ఈ ఉత్సవాల్లో ప్రదర్శితమవుతోంది. ఇది ప్రాపంచిక జ్ఞానానికి అంతర్జాతీయ సంక్షాభానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉన్న చిత్రం. అంతర్యుద్ధం కారణంగా సిరియా దేశం అతలాకుతలమైన వార్తలు అప్పట్లో ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ దేశంలో నగరాలకు నగరాలే యుద్ధంలో నేలమట్టమవుతూ నామరూపాల్లేకుండా పోయాయి. సిరియా నేలపై ఎక్కడ చూసినా మొండి గోడలు.. చనిపోయిన వారి బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాదకర ఉగ్రభూతం ఐసిస్ కి సిరియన్ సైన్యానికి మధ్య సాగిన అవిరామ పోరు పర్యవసానమిది. ఇందులో అగ్ర రాజ్యం దాష్ఠీకం మరోవైపు సిరియా వినాశనానినికి కారణమైంది. ఆ దేశంలో ప్రజలంతా శవాల దిబ్బగా మారుతూ భవిష్యత్ ప్రపంచానికి చీకటి సాక్ష్యంగా నిలుస్తూ భాయోత్పాతాన్ని కలిగించే పరిస్థితి నెలకొంది.

సిరియన్ అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తమ ఆప్తుల్ని పోగొట్టుకున్నారు. ఓ మూడేళ్ల బాలుడు రక్తపు మడుగులో ప్రాణాల కోసం నిశీధిలోకి చూస్తున్న ఫొటోలు ఈ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. అదే చిన్నారి కోణంలో సిరియా అంతర్యుద్ధాన్ని తెరపైకి తీసుకొస్తూ మన తెలుగు కుర్రాడు దేవ్ పిన్ అలియాస్ వాసు పిన్నమరాజు చేసిన ప్రయత్నం `ఐయామ్ గొన్న టెల్ గాడ్ ఎవ్రీతింగ్`. (నేను దేవుడికి ప్రతీదీ చెప్పబోతున్నాను). ఓ ప్రముఖ బ్యానర్ లో అద్భుతమైన కాన్పెప్ట్ ఉన్న సినిమా చేసేందుకు రెడీ అవుతున్న వాసు పిన్నమరాజు ఈ లఘు చిత్రంతో గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో తన సత్తా ఏంటో చూపించబోతున్నాడు. వాసు పిన్నమరాజు లాస్ ఏంజెల్స్ లో శిక్షణ పొంది హాలీవుడ్ చిత్రాలకు పని చేశారు. అలాగే పలు తెలుగు చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్ గానూ పని చేశారు.

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో `ఐయామ్ గొన్న టెల్ గాడ్ ఎవ్రీతింగ్` మూవీ ఫీచర్ ఫిలిం కేటగరీలో ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైంది. గోవా రాజధాని పానాజీలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరిగే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో దీనిని ప్రదర్శించనున్నారు. ఇప్పటికే విదేశీ ఫిలింఫెస్టివల్స్ లో బెస్ట్ డైరెక్టర్ గా అవార్డుని సొంతం చేసుకున్న వాసు పిన్నమరాజు ఈ సినిమాతో గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ మరోసారి అవార్డును అందుకోబోతుండటంతో టాలీవుడ్ సర్కిల్స్ లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 2019 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI గోవా) వేడుకల్లో 76 దేశాలకు చెందిన దాదాపు 200 సినిమాల్ని ఇక్కడ ప్రదర్శించనున్నారు. 26 ఫీచర్ సినిమాలు.. 15 నాన్ ఫీచర్ సినిమాల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దాదాపు 12000 మంది సినీప్రముఖులు ఈ వేడుకలకు ఎటెండ్ కానున్నారు.
Please Read Disclaimer