టిక్ టాక్ వీడియోల మీద భారత్ అంతలా కన్నేసిందా?

0

టిక్ టాక్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టాలు పాపులర్ కావటానికి ఏళ్లకు ఏళ్లు పడితే.. టిక్ టాక్ మాత్రం అందుకు భిన్నంగా అనతి కాలంలో విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందింది. నగర.. పట్టణ.. గ్రామీణం అన్న తేడా లేకుండా ఒకేసారి అన్నిచోట్ల అందరి నోట నానుతున్న ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తాజాగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.

చైనాకు చెందిన టిక్ టాక్.. తాజాగా తన వీడియోల మీద ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నిఘా ఎంతన్న విషయాన్ని పేర్కొంది. తమ ఫ్లాట్ పాంలో ఉండే వీడియోలకు సంబంధించిన వినియోగదారుల సమాచారం ఇవ్వాలంటూ ప్రపంచంలో ఏయే దేశాలు ఎంత ఎక్కువగా కోరుతాయో చెప్పింది.

ప్రపంచ వ్యాప్తంగా 28 దేశాలకు చెందిన ప్రభుత్వాలు తమ దేశానికి చెందిన వినియోగదారుల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంటాయని పేర్కొంది. తమకు వచ్చే వినతుల్లో 36 శాతం కేవలం భారత్ అధికారుల నుంచే వస్తున్నట్లు చెప్పింది. టిక్ టాక్ యూజర్లలో నలబై శాతం కేవలం భారత్ కు చెందిన వారుకావటంతో.. వినతుల సంఖ్య భారత్ ఎక్కువగా ఉండటం పెద్ద విషయం కాదు.

కానీ.. టిక్ టాక్ వీడియోలను పోస్టు చేసే వినియోగదారులకు సంబంధించిన సమాచారం మీద భారత్ డేగకన్ను వేసిందన్న అభిప్రాయాన్ని టిక్ టాక్ వ్యక్తం చేసినట్లు చెప్పాలి. వివిద దేశాల నుంచి వచ్చే వినతుల్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని టిక్ టాక్ పేర్కొంది. యూజర్ల కామెంట్లు వివిధ దేశాలకు చెందిన చట్టాల్ని ఉల్లంఘించేలా ఉన్నాయా? దేశాల వినతులు న్యాయ ప్రక్రియకు లోబడే ఉన్నాయా? అన్న అంశాల్ని ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తామని యాజమాన్యం చెప్పింది.

భారత్ కు చెందిన అధికారులు కోరినట్లుగా వినియోగదారుల సమాచారాన్ని తాము అందించినట్లు టిక్ టాక్ వెల్లడించింది. భారత్ నుంచి వచ్చిన వినతుల్లో సగానికన్నా తక్కువ కేసుల్లో వినియోగదారుల సమాచారాన్ని తాము అందించినట్లు చెప్పింది. పెడ ధోరణుల్ని టిక్ టాక్ సైతం ప్రోత్సహించదని.. పిల్లల ప్రైవసీకి సంబంధించిన నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా కంప్లైంట్లు వస్తే.. వాటిని వెంటనే తొలగించాలంటూ తమకు వినతులు వస్తాయని చెప్పింది. అలా వచ్చిన వినతుల్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని చెప్పింది. గత ఏడాది తమకు అలాంటి వినతులు 11 రాగా.. ఎనిమిది ఖాతాల్ని తాము పూర్తిగా మూసివేశామని.. మూడు ఖాతాలకు సంబంధించిన కంటెంట్ ను తొలగించినట్లుగా పేర్కొంది. మొత్తంగా టిక్ టాక్ వీడియోలపై కేంద్రం డేగ కన్ను వేసిందన్న విషయాన్ని టిక్ టాక్ తాజా నివేదిక స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer