గోమూత్రం తాగి.. పేడ తింటే ప్రేమ పెళ్లికి ఓకే

0

ఉత్తరప్రదేశ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉండగా అంతే పెద్ద సంఖ్యలో నేరాలు జరుగుతున్నాయి. తరచూ ఆ రాష్ట్రంలో అమానుష దారుణ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఈ రాష్ట్రంలో ఓ అమానవీయ చర్య బహిర్గతమైంది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ గ్రామ పెద్దలు వధువుకు గోమూత్రం సేవించాలని పేడ తినాలని శిక్ష విధించారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ వరుడు కోర్టును ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఝాన్సీ జిల్లా ప్రేమ నగర్ లోని గౌల్ టోలీకి చెందిన భూపేశ్ యాదవ్ ఆష్టాజైన్ ప్రేమ వివాహం చేసుకుని వారి గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి గ్రామపెద్దలు వ్యతిరేకించారు. గ్రామ కట్టుబాట్లు సంప్రదాయాలను ఉల్లంఘించారంటూ ఆ కొత్త జంటను గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో ఆ దంపతులు గ్రామం విడిచి మరోప్రాంతంలో కాపురం పెట్టారు. అయితే అప్పటినుంచి గ్రామానికి చెందిన పలువురు వరుడు కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వరుడు తన కుటుంబాన్ని వేధించవద్దని గ్రామ పెద్దల్ని కోరాడు. దీంతో గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి విచారించారు.

భూపేశ్ ప్రేమ పెళ్లి అంగీకరించాలంటే మీ కుటుంబంపై బహిష్కరణ తొలగించాలంటే వధువు గోమూత్రం తాగి ఆవుపేడ తినాలని చెబుతూ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. భూపేశ్ తండ్రి తీర్పు మార్చాలని గ్రామపెద్దల్ని కోరగా వారు నిరాకరించారు. దీంతో బాధితుడు భూపేశ్ ఝాన్సీ జిల్లా మేజిస్ట్రేట్ ను ఆశ్రయించాడు. ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని మేజిస్ట్రేట్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పీ) డాక్టర్ ప్రదీప్ కుమార్ ను ఆదేశించారు. ఈ మేరకు పంచాయితీ పెద్దలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కొత్త దంపతులకు భద్రత కల్పించారు.

అధునాతన సమాజం లో ఇంకా ఇలాంటి తీర్పులు పంచాయితీలు ఉండడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చర్యలే భారత్ ను అభివృద్ధి ని వెనక్కు నెడుతోందని మేధావులు పేర్కొంటున్నారు. కట్టుబాట్లు సంప్రదాయాలు అని పట్టుకు కూర్చుంటే దేశం ముందుకు వెళ్లదని చెబుతున్నారు.
Please Read Disclaimer