భార్యాభర్తల గొడవతో రక్తికట్టిన ‘బిగ్ బాస్’ డ్రామా

0

తెలుగు ‘బిగ్ బాస్’ మూడో సీజన్ విషయంలో జనాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పార్టిసిపెంట్లు ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ తొలి వారం షో అనుకున్నంత ఆసక్తికరంగా లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున తొలి వీకెండ్లో ఉన్నంతలో బాగానే షోను నడిపించినా.. ఆశించినంత కిక్ ఇవ్వలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. షోను పైకి లేపడానికి ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి నెలకొంది. నాటకీయ పరిణామాల కోసం అటు షో నిర్వాహకులు ఇటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజా ఎపిసోడ్లో డ్రామా పండింది. హౌస్ లో ఉన్న భార్యాభర్తలు వరుణ్ సందేశ్ వితికల మధ్య విభేదాలు తలెత్తడంతో ఎపిసోడ్ పండింది.

‘బిగ్ బాస్’ హాల్లో అందరూ కూర్చుని ఉండగా.. తాను కష్టపడి అందరి కోసం 40 దోసెలు వేశానని చెప్పుకొచ్చింది వితిక. ఐతే నేను గ్యాస్ తొక్కకపోతే నువ్వు దోసెలు ఎలా పోసేదానివని పునర్ణవి అంది. నువ్వు కాకపోతే ఇంకొకరు గ్యాస్ తొక్కేవాళ్లని వితిక అంది. మధ్యలో వరుణ్ జోక్యం చేసుకుని నువ్వు కాకపోతే మరొకరు దోసెలు పోసేవారు కదా అన్నాడు. ఈ విషయంలో తాను న్యాయబద్ధంగా మాట్లాడతానని అన్నాడు. దీంతో వితిక హర్టయింది.

ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఆమెను ఓదార్చడానికి వరుణ్ వెళ్లలేదు. సీరియల్ నటుడు రవికృష్ణ వెళ్లాడు. కాసేపటికి పరిస్థితి తీవ్రత అర్థం చేసుకున్న వరుణ్.. భార్య కోసం వెళ్లాడు. ఆమెకు సారీ చెప్పి ఓదార్చాడు. మొత్తంగా మంగళవారం షో ఈ నాటకీయ పరినామాలతో వేడెక్కింది. ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్’ లోకి ఇప్పటికే ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా.. ఇదే మార్గంలో ఇంకో ఇద్దరు లోనికి రాబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అందులో ఒకరు నటి శ్రద్దా దాస్ అంటున్నారు.
Please Read Disclaimer