ఈయనే టాలీవుడ్ కరణ్ జోహార్

0

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ .. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. బాలీవుడ్ లో నవతరం ట్యాలెంటును ప్రోత్సహిస్తూ .. నటవారసుల్ని తెరకు పరిచయం చేస్తూ ఆయన చేస్తున్న సేవ గురించి తెలిసిందే. కొత్త హీరో లేదా కొత్త హీరోయిన్ ఎవరైనా ఆయన ద్వారానే పరిచయం కావాలి. ఆయన హస్తవాసి అంత మంచిదన్న పేరు ఉంది. అలాగే కరణ్ తన సామ్రాజ్యాన్ని ఇరుగు పొరుగు భాషలకు విస్తరిస్తూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే బాహుబలి -హిందీ నిర్మాతగా ఆయనకు ప్రత్యేక గౌరవం దక్కింది. అటుపైనా ఇరుగు పొరుగు భాషల్లో సినిమాల్ని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తూ స్నేహహస్తం అందిస్తున్నారు. అది అతడికి బాగానే వర్కవుటవుతోంది. ఇక ఇరుగు పొరుగు భాషల్లో సినిమాల్ని రీమేక్ చేస్తూ ఆ రకంగానూ భారీగా ఆర్జిస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఆయనని స్ఫూర్తిగా తీసుకుని టాలీవుడ్ కరణ్ జోహార్ గా మారతానని అంటున్నారు అగ్రనిర్మాత దిల్ రాజు. నిర్మాత కం పంపిణీదారుడు కం ఎగ్జిబిటర్ గా ఆయన కెరీర్ జర్నీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ దసపల్లాలో జరిగిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ తన భవిష్యత్ ప్లానింగ్స్ గురించి రివీల్ చేశారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ తరహాలోనే తాను కూడా నవతరం ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తానని.. కొత్త నిర్మాతల్ని ప్రోత్సహిస్తూ కొత్త కాన్సెప్టులతో సినిమాలు నిర్మిస్తానని తెలిపారు. తనవద్దకు వచ్చే ఔత్సాహిక నిర్మాతల్ని నిరుత్సాహపరచకుండా వారికి అండగా నిలుస్తానని అన్నారు. ఇక దిల్ రాజు అనే బ్రాండ్ ని ఇతరులకు ఉపయోగపడేలా సాయపడతానని మంచి మనసును చాటుకున్నారు.

కరణ్ జోహార్ గా మారాలన్న ఆలోచన బావుంది. కొత్త తరానికి దిల్ రాజు రూపంలో పెద్ద సాయం అవసరం కూడా. దీంతో రకరకాల జోనర్లలో సినిమాల్ని తీసేందుకు ఔత్సహిక నిర్మాతలు మరింత మంది ముందుకొచ్చే వీలుంటుంది. మంచి సినిమా తీసి రిలీజ్ చేయలేక తంటాలు పడేవాళ్లకు దిల్ రాజు పెద్ద సాయం చేసినట్టవుతుంది. తెరమరుగున పడిపోయిన కొన్ని కథలకు వెండితెరపై ప్రాణం పోసేందుకు అవకాశం దక్కుతుంది. దిల్ రాజు తరహాలోనే డి.సురేష్ బాబు.. అల్లు అరవింద్ .. బన్ని వాసు వంటి నిర్మాతలు ఈ తరహా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంత ఠఫ్ కాంపిటీషన్ ఉన్నా అందరిలో తనదైన మార్క్ తో దూసుకుపోతున్న దిల్ రాజు కల నెరవేరాలనే భావిద్దాం. ఆయన మరో `టాలీవుడ్ కరణ్ జోహార్` అయితే మంచిదే.

ఇటీవలే మహర్షి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దిల్ రాజు తదుపరి మహేష్ తోనే `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనీల్ సుంకరతో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలువురు నవతరం హీరోలతో సినిమాలు తీస్తూ .. పలు క్రేజీ చిత్రాల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer