జాను టీమ్ కు విజయంపై నమ్మకం లేదా?

0

రీమేక్ సినిమాలపై తెలుగు ఫిలిం మేకర్లకు ఆసక్తి ఎక్కువే. టాలీవుడ్ మేకర్లు ఎప్పుడైనా ఒక రీమేక్ చేస్తున్నారంటే చాలు ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉంటుంది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా జెనరేషన్ కాబట్టి రీమేక్ అని ప్రకటన రాగానే ఒరిజినల్ సినిమాను తమ లాప్ టాపులలో.. ఫోన్లలో చూసేస్తారు. అయినా కూడా రీమేక్ సినిమాపై ఆసక్తి వ్యక్తం అవుతుంది. కానీ సమంతా- శర్వానంద్ లు నటిస్తున్న ‘జాను’ పై మాత్రం ఎందుకో పెద్దగా హైప్ రావడం లేదు.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ’96’ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోయినేడాది డిసెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది..అయితే కుదర లేదు. వాయిదా సంగతి పక్కన పెడితే ఈ సినిమా టీజర్.. ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే చాలామంది ప్రేక్షకులకు ఇవేవీ తెలియవు. అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అడిగితే చాలామంది బిక్కమొహం పెడుతున్నారు.

టీజర్.. ఫస్ట్ సాంగ్ కొందరిని ఆకట్టుకున్నాయి కానీ సినిమాపై మాత్రం బజ్ రావడం లేదు. దిల్ రాజు కూడా ప్రమోషన్స్ పై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. తమిళ వెర్షన్ తో పోలికలు ఎక్కువ అవుతాయని భారీగా ప్రమోషన్స్ చేయడం లేదని ఒక వాదన వినిపిస్తోంది. అయితే స్లో గా ఉండే సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చడం కష్టమని.. అందుకే ఈ సినిమా పై ఇప్పటికే ఆశలు వదులుకున్నారని అందుకే ప్రమోషన్స్ వదిలేశారని కూడా కొందరు అంటున్నారు. సమంతా లాంటి స్టార్ హీరోయిన్.. శర్వానంద్ లాంటి హీరో ఉన్నప్పటికే ఇలా తక్కువ బజ్ ఉండడం మాత్రం దిల్ రాజు పబ్లిసిటీ స్ట్రేటజీలో లోపమేనని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి సినిమా రిలీజ్ లోపు పరిస్థితి ఏమైనా మారుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer