పూరీ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందా…?

0

ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ‘చిరుత’ ‘బుజ్జిగాడు’ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్ ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా టాలీవుడ్ లో ఎంటర్ అయ్యాడు. భారీ ఆశలు పెట్టుకుని తీసిన మెహబూబా సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. దీని కోసం కథ – స్క్రీన్ ప్లే – మాటలు అందించి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి దర్శకత్వ భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ – చార్మీ కలిసి నిర్మించారు. పూరీ ఆకాశ్ కు జోడీగా ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మని తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మంచి ఆదరణ పొందటంతో ‘రొమాంటిక్’ సినిమాకి బాగానే క్రేజ్ వచ్చింది. మంచి రిలీజ్ డేట్ చూసుకొని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ వేసుకున్న పూరీ అండ్ టీమ్ కి నిరాశే మిగిలింది. బ్యాడ్ లక్ కరోనా రూపంలో వచ్చి సినిమా వాయిదా పడేలా చేసింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. దీంతో అప్పటి దాకా వెయిట్ చేద్దాం అని అనుకున్నవారు కూడా తమ సినిమాలను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే డజను సినిమాలు డైరెక్ట్ ఓటీటీ లో విడుదలయ్యాయి. ఈ క్రమంలో ‘రొమాంటిక్’ సినిమాని కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి పూరీ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వారు ఐతే పూరీతో సంప్రదింపులు జరుపుతున్నారని.. ఈ సినిమా విషయంలో ఓటీటీ వారు భారీగానే ఆఫర్ చేసారని సమాచారం. కాక పోతే పూరీ జగన్నాథ్ నుంచి ఇంకా దీని పై రిప్లై రాలేదట. అయితే ‘రొమాంటిక్’ లాంటి సినిమా ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఓటీటీ రిలీజ్ చేస్తేనే లాభాలు వచ్చే అవకాశం ఉందని.. అందరూ ఓటీటీలో సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం తో హీరోగా ఆకాష్ పూరీకి ఒక గుర్తింపు వస్తుందని.. ఒకవేళ థియేటర్స్ రీ ఓపెన్ అయినా ఈ సినిమాకి థియేటర్స్ దొరకడంలో పోటీ ఎక్కువ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు. మరి పూరీ జగన్నాథ్ తనయుడి ‘రొమాంటిక్’ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Please Read Disclaimer