ఆ తీవ్ర ఒత్తిడితోనే జయప్రకాష్ రెడ్డికి గుండెపోటు!

0

తన విలక్షణమైన నటన, రాయలసీమ యాసతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం చిత్రసీమలో తీవ్ర విషాదం నింపింది. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుని బాధపడని నటీనటులు లేరు. సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల స్పందించారు. ఆయనకు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారనే విషయం తెలిసిందే. గుంటూరులోని తన నివాసంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో బాత్‌రూమ్‌‌లోనే కుప్పకూలారు జేపీ. అయితే, ఆయనకు గుండెపోటు రావడానికి కారణం తీవ్ర ఒత్తిడి అని తెలుస్తోంది. నిజానికి జయప్రకాష్ రెడ్డి హార్ట్ పేషెంట్. కొన్ని నెలల క్రితం ఆయన హార్ట్‌లో స్టంట్ వేశారు. ఆ శస్త్ర చికిత్స తర్వాత జేపీ ఆరోగ్యంగానే ఉన్నారు.

అయితే, జయప్రకాష్ రెడ్డి మినహా ఆయన కుటుంబం మొత్తం ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డారని సమాచారం. జేపీ భార్య, కూతురు, కుమారుడు, కోడలు, వారి పిల్లలకు కరోనా వైరస్ సోకిందని ఆయన కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా తెలిసింది. జయప్రకాష్ రెడ్డి కుమారుడు, కోడలు గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొందుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే, తన కుటుంబంలో సంభవించిన ఈ పరిస్థితి జయప్రకాష్ రెడ్డిని కుంగదీసిందని అంటున్నారు. గత రెండు రోజులుగా జయప్రకాష్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురయ్యారని సమాచారం. ఆ ఒత్తిడి వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా జయప్రకాష్ రెడ్డి మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం.