ఏంది సామ్.. ఇదంతా కుక్క కోసమే?

0

అపురూపంగా చూసుకునే వాటి మీద ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. అయితే.. అంత ఎమోషనల్ కనెక్ట్ ఉన్న వారిని అర్థం చేసుకునే విషయంలో ఏ మాత్రం తేడా దొర్లినా అపార్థంగా మారటం ఖాయం. ఒకరికి అపురూపమైనవి మరొకరికి కాకపోవచ్చు. కాకుంటే.. తమకున్న భావోద్వేగ బంధాల్ని వెల్లడించే విషయంలో కాస్తంత జాగరూక అవసరం. సెలబ్రిటీల విషయంలో ఇది మరింత ఎక్కువ.

ఎందుకంటే.. సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టుల్ని లక్షలాది మంది ఫాలో అవుతుంటారు. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. అందరూ ఒకేలాంటి టెంపర్ మెంట్ తో అస్సలు ఉండరన్నది మర్చిపోకూడదు. వ్యక్తిగత విషయాల్ని పంచుకునే వేళలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించకపోతే విమర్శల పాలు కావటం ఖాయం. తాజాగా ప్రముఖ నటి సమంత పరిస్థితి ఇదే రీతిలో ఉందని చెప్పక తప్పదు.

ఆమెకు కుక్కలంటే ఎంత ఇష్టమో తెలిసిందే. చైతూతో కలిసి వారిప్పుడు హష్.. డ్రోగో అనే రెండు అమెరికన్ పిట్ బుల్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల హష్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక భావోద్వేగమైన పోస్టును ఇన్ స్టాలో పోస్టు చేశారు.
హష్ కు ముందు తాను బుగబూ అనే కుక్కపిల్లను పెంచుకున్నానని.. దానికి పార్వో వైరస్ సోకటంతో ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే అది కన్నుమూసిందన్నారు. దాన్ని గుర్తు చేసుకుంటూ మెసేజ్ పెట్టారు. తాను బుగబూ కోసం నెల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు.

కానీ.. ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే వైరస్ సోకి చనిపోయిందని.. దాని చావుకు తానే కారణమని భావించినట్లు పేర్కొన్నారు. గుండె పగిలేలా ఏడ్చానని.. ఇంకెప్పుడు కుక్కపిల్లను తెచ్చుకోకూడదని అనుకున్నట్లు పేర్కొన్నారు. అయితే.. నెల రోజులకే చైతూ మరో కుక్కను తెచ్చుకుందామంటూ హష్ ను తెచ్చాడన్నారు. దానికి పార్వో వైరస్ సోకుతుందేమోనని భయపడ్డానని.. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్.. డాక్టర్ ను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. హష్ కు ఏమైనా అవుతుందేమోనని ఏడుస్తూ ఉండేదానినని.. మొత్తానికి దానికి ఏడాది నిండినట్లు పేర్కొన్నారు. అందుకు దాని ఫస్ట్ బర్త్ డేకు తాను ఎగ్జైట్ అవుతున్నట్లు చెప్పారు.

బుజ్జి పప్పీ మీద సామ్ కున్న ప్రేమ.. దాంతో తానెంత కనెక్ట్ అయ్యిందన్న విషయం ఆమె పోస్టును చూస్తేనే అర్థమవుతుంది. కానీ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ తో చనిపోవటానికి తాను కారణమని ఏడవటం ఏమిటి? నిజానికి ఆ పప్పీ సామ్ దగ్గర కాకుండా ఇంకెక్కడ ఉన్నా రెండురోజులకే చనిపోయేదేమో?

ఇవాల్టి రోజున ఎంతోమంది తమ పిల్లలకు సరైన వైద్యం అందించలేక విలవిలలాడిపోతున్న దుస్థితి. డబ్బుల్లేక పోషకారహారలోపంతో ప్రాణాలు విడిచేవారెందరో. ఇలాంటి సమాజం చుట్టూ ఉన్న వేళ.. అన్ని వసతులు సమకూర్చిన తర్వాత కూడా చనిపోయిన కుక్కపిల్ల కోసం సామ్ అంతగా వేదన చెందటం.. గుండెలు పగిలేలా ఏడ్వటం లాంటి మాటలు విన్నప్పుడు..ఇదేంది సామ్ అన్న మాట నోటి వెంట రాకమానదు. కాదంటారా?
Please Read Disclaimer