ట్వీట్లు పోస్ట్ చేయటం కాదు.. ఇలా వెళ్లటం దీపికకు మాత్రమే సాధ్యమేమో?

0

పాజిటివ్ అంశాల మీద రియాక్ట్ కావటం.. అదే పనిగా సోషల్ మీడియాలో ట్వీట్లు.. పోస్టులు.. స్టోరీలు పెట్టేయటం ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీ లు చేస్తున్నదే. సెలబ్రిటీ అన్నాక గతంలో ఉండే హంగులకు భిన్నంగా తాజా డిజిటల్ యుగంలో సోషల్ మీడియా టీంను పెట్టుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. దేశంలో జరిగే వివిధ అంశాల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ.. మైలేజీ వస్తుందనిపిస్తే చాలు.. సోషల్ మీడియాలోకి దూసుకొచ్చే వ్యూహాన్ని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అమలు చేస్తున్నారు.

ఇలాంటివేళ.. మిగిలిన వారికి తాను చాలా భిన్నమన్న విషయాన్ని తన చేతలతో చెప్పేశారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే. ఒక షాకింగ్ సంచలన విషయంలో స్పందించేందుకు కొద్దిమంది మాత్రమే ముందుకొచ్చిన జేఎన్ యూ వర్సిటీలో చోటు చేసుకున్న దాడి పై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఊహించని రీతిలో వ్యవహరించారు. వర్సిటీ క్యాంప్ లో జరిగిన దాడికి వ్యతిరేకంగా.. విద్యార్థులకు మద్దతుగా దీపిక అక్కడకు వెళ్లారు.

ఆగంతుకుల దాడిలో గాయపడిన విద్యార్థుల్ని కలిసిన దీపిక.. జరిగిన ఉదంతానికి సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. గత ఆదివారం(జనవరి 4న) సాయంత్రం జేఎన్ యూ హాస్టల్ ప్రాంగణంలోకి దూసుకొచ్చిన 50 మంది దుండగులు.. కర్రలు.. ఇనుప రాడ్లతో రెండు గంటల పాటు హల్ చల్ చేయటం.. టార్గెట్ చేసి మరీ కొందరు విద్యార్థుల పై దౌర్జన్యానికి పాల్పడటం.. వారిని తీవ్రంగా గాయపర్చటం లాంటివి చేశారు. ఈ ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. దాదాపు 30 మందికి పైగా విద్యార్థులు ఈ దాడిలో గాయపడ్డారు. బాధిత విద్యార్థులకు అండగా నిలుస్తు కొందరు బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు చేస్తే.. అందుకు భిన్నంగా దీపిక మాత్రం నేరుగా జేఎన్ యూ క్యాంపస్ కే రావటం ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer