మరోసారి క్లాసిక్ ని లేపేశాడంటూ!

0

కాపీకి స్ఫూర్తికి మధ్య సన్నని లైన్ మాత్రమే అడ్డు. ఆ రెండిటికీ మధ్య తేడా ఏమిటో అర్థమయ్యేలా ఎవరూ క్లారిటీగా చెప్పడం లేదు. అయితే మన స్టార్ డైరెక్టర్లు కాపీ క్యాట్ సినిమాలు తీస్తున్నారని తేలిగ్గానే విమర్శించేయడం రివాజుగా మారింది. ఫలానా సీన్ లేపేశారని.. పూర్తిగా కథనే ఎత్తేశారని లేదా పార్టులు పార్టులుగా కాపీ చేశారని ఇలా విమర్శలు అయితే తప్పడం లేదు. ఫలానా హాలీవుడ్ సినిమా లైన్ తీసుకుని తెలివిగా సీన్లు రాసుకుని తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన బాపతు దర్శకులకు కొదవేమీ లేదన్న విశ్లేషణలు ఎన్నో వెలువడ్డాయి.

ఈ వరుసలోనే మరో ఆరోపణ ఫిలింసర్కిల్స్ లో వేడెక్కిస్తోంది. అది కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ కి వస్తున్న `అల వైకుంఠపురములో` సినిమా లైన్ ఇదీ అంటూ ఓ వార్త సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని `ఇంటి గుట్టు` అనే ఓ క్లాసిక్ సినిమా స్ఫూర్తితో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారన్న విశ్లేషణలు సామాజిక మాధ్యమాల్లో వేడెక్కిస్తున్నాయి.

ఇంటిగుట్టు టైటిల్ తో టాలీవుడ్ లో రెండు సినిమాలొచ్చాయి. వీటిలో ఎన్టీఆర్- సావిత్రి నాయకానాయికలుగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ 1958లో రిలీజైంది. క్లాసిక్ డేస్ లో విజయం సాధించిన చిత్రమిది. ఈ సినిమా లైన్ ని తీసుకుని నేటి జనరేషన్ కు తగ్గ కథను అల్లుకుని `అల వైకుంఠపురములో` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ప్రచారమవుతోంది. ఒకే సమయంలో వేర్వేరు తల్లులకు జన్మించిన ఇద్దరు మగ బిడ్డలు అటు ఇటు తారుమారు అయితే ఆ తర్వాత తలెత్తిన పరిణామాలేమిటి? అన్న కథాంశాన్ని ఎంచుకుని త్రివిక్రమ్ మ్యాజిక్ చేయబోతున్నాడట. ఇందులో బన్ని- సుశాంత్ ఇద్దరూ తారుమారు అవుతారు. లైన్ ఆసక్తికరంగానే ఉంది. కానీ నాటి క్లాసిక్ తో పోలిస్తే తాజా చిత్రంలో ఎలాంటి వైరుధ్యం చూపించబోతున్నారు? నేటి తరానికి ఎలా కనెక్ట్ చేయబోతున్నారు? అన్నది చూడాలి అంటూ సోషల్ మీడియాలు.. వాట్సాప్ గ్రూపుల్లో డిబేట్ సాగుతోంది. బన్ని ఫ్యాన్స్ లోనూ ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలోనూ త్రివిక్రమ్ పై ఈ తరహా ఆరోపణలు ఎన్నో వచ్చాయి. కానీ అవేవీ సినిమా ఆదరణకు అడ్డంకిగా మారలేదన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer