ఇస్మార్ట్ డబుల్ కలెక్షన్స్ గురూ!

0

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ని పూరి- ఛార్మి బృందం ఓ రేంజులో సెలబ్రేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని నగరాల్ని సందర్శించి అభిమానులకు కృతజ్ఞతలు చెబుతోంది ఇస్మార్ట్ టీమ్. పనిలో పనిగా ఇస్మార్ట్ కలెక్షన్స్ కి మైలేజ్ పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లోనూ నిరంతరం ప్రచారం చేస్తున్నారు. ఈ రెండ్రోజుల్లో ఇస్మార్ట్ టీమ్ తో జాయిన్ అయ్యేందుకు రామ్ రెడీ అవుతున్నారు. విదేశీ వెకేషన్ ముగించి రామ్ ఇస్మార్ట్ టీమ్ తో జాయిన్ అవుతున్నారని ఛార్మి తెలిపారు.

ఇప్పటివరకూ ఇస్మార్ట్ శంకర్ సాధించిన వసూళ్లు ఎంత? అంటే … ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 31 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తోంది. కేవలం 17 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్మోస్ట్ బడ్జెట్ కి డబుల్ షేర్ వసూలు చేసింది. అంటే ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లు ఫుల్ హ్యాపీ అని అర్థమవుతోంది.

వరుస ఫ్లాప్ లతో అల్లాడిన పూరి- ఛార్మి బృందానికి.. యువ హీరో రామ్ కి ఇదో బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఇక ఇదే ఉత్సాహంలో పూరి తదుపరి ప్రణాళికల్లో బిజీ కానున్నారు. పూరి కనెక్ట్స్ టీమ్ లైబ్రరీ నుంచి పలు స్క్రిప్టుల్ని ఇప్పటికే దుమ్ము దులిపి పైకి తీస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే పలువురు యువహీరోల్ని పూరి సంప్రదించనున్నారట. అలాగే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ సినిమాకి ఇప్పటి నుంచే స్క్రిప్టు పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
Please Read Disclaimer