ఇస్మార్ట్ శంకర్.. ఈ ఫిగర్లు నిజమేనా?

0

గత పదేళ్లలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనది కాని కథతో తెరకెక్కించిన ‘టెంపర్’ మినహా అన్నీ డిజాస్టర్లే. రెండంకెల సంఖ్యలో ఆయన పరాజయాలందుకున్నారు. సినిమా సినిమాకూ తన స్థాయిని తగ్గించుకుంటూ పాతాళానికి పడిపోయాడు. ఇక హీరో రామ్ కెరీర్ కూడా ఒడుదొడుకులతోనే సాగుతోంది. అతను నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. దీని టీజర్ – ట్రైలర్లకు మిశ్రమ స్పందన వచ్చింది. ఐతే మాస్ సినిమా కావడం వల్ల ఆ వర్గం ప్రేక్షకుల్లో దీనిపై కొంత మేర ఆసక్తి ఉంది. అలాగని ఈ చిత్రానికి అంచనాల్ని మించి బిజినెస్ జరిగిపోయే పరిస్థితి లేదు. కానీ చిత్ర బృందం మాత్రం బిజినెస్ లెక్కల్ని ఎక్కువ చేసి చూపుతోందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

‘ఇస్మార్ట్ శంకర్’ నైజాం ఏరియా హక్కుల్ని ఏకంగా రూ.7.5 కోట్లకు అమ్మారట. ఆంధ్రా హక్కులు రూ.6 కోట్ల దాకా పలికాయట. మొత్తంగా రూ.19 కోట్ల దాగా థియేట్రికల్ బిజినెస్ చేసిందట ఈ చిత్రం. స్వయంగా చిత్ర సమర్పకురాలు ఛార్మినే ఈ వివరాలు వెల్లడించింది. ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే రూ.17 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పుకోవడం విశేషం. రామ్ కెరీర్లో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమా ఇదే అని.. రూ.20 కోట్ల బడ్జెట్ పెడితే రూ.16 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని అంటున్నారు. కానీ డిజాస్టర్ల డైరెక్టర్ – పెద్దగా హిట్లు లేని హీరో కలిసి చేసిన సినిమా.. పైగా ప్రోమోలతో మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశముందా అన్నది సందేహం. వీళ్లు చెబుతున్న ఫిగర్లు నిజమే అయితే మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద టాస్క్నే ఛేదించాల్సి ఉంటుంది.
Please Read Disclaimer