జాను పీఆర్ టీమ్ ఏం చేస్తోంది?

0

ఒక సినిమాకు మంచి కంటెంట్ ఎంత ముఖ్యమో ఆ సినిమాకు ప్రచారం కూడా అంతే ముఖ్యం. ఎంత మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ప్రచారం విషయంలో విఫలమైతే మాత్రం ముకేష్ యాడ్ లో చెప్పినట్టుగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. శర్వానంద్ – సమంతాల ‘జాను’ విషయమే తీసుకుంటే ప్రమోషన్స్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది.

తమిళంలో ’96’ ఒక భారీ హిట్. సంచలన విజయం సాధించిన చిత్రం. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారు అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమైంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రీమేక్ టేకప్ చేసి ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ నే దర్శకుడిగా ఎంచుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంతాను హీరోయిన్ గా.. టాలెంటెడ్ హీరో శర్వానంద్ ను హీరోగా ఎన్నుకున్నారు. ఇంతకంటే బెస్ట్ ఛాయిస్ మరొకటి ఉండదు. హీరో హీరోయిన్లు ఇద్దరూ మంచి పెర్ఫార్మర్లే. సినిమా షూటింగ్ పూర్తయింది. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు సినిమాకు బజ్ లేదు.

ఈమధ్యే సమంతా.. శర్వా కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు.. ఆ కార్యక్రమానికి నాని గెస్ట్ గా హాజరయ్యారు. అయినా ఏమాత్రం హైప్ రాలేదు. శర్వా గత సినిమాలు గమనిస్తే రిలీజుకు ముందు మంచి బజ్ ఉండేది. కానీ సినిమాకు చాలా తక్కువ బజ్ ఉంది. ఈ సినిమా క్లాస్ స్టోరీ.. ఎ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్టోరీ. ఈ సినిమాను రూరల్ ఏరియాల్లో.. మాస్ సెంటర్లలో జోరుగా ప్రచారం చేయడం అవసరం. అలా అని క్లాస్ ఆడియన్స్ ను ఆకర్షించే ప్రమోషన్స్ చేస్తున్నారా అంటే అదీ లేదు. అసలు ‘జాను’ సినిమా పీఆర్ టీమ్ ఏం చేస్తోందో అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

సినిమా ఎలాగైనా ఆడేస్తుందిలే అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు కానీ ఈ సినిమాకు ఒక మైనస్ ఏంటంటే ఒరిజినల్ సినిమాను చాలామంది ఇప్పటికే చూశారు. ఇక ‘జాను’ రిలీజ్ అయిన వారం రోజుల్లో విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ అవుతోంది. సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం ‘జాను’ కు డేంజరే. ఇదిలా ఉంటే శర్వానంద్ తన సినిమాల పట్ల మంచి కేర్ తీసుకునే వ్యక్తి. ఈ సినిమా విషయంలో శర్వా సైలెంట్ గా ఉండడంతో ఈ సినిమాపై లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా పీఆర్ టీమ్ మేలుకొని ప్రమోషన్స్ చేస్తే మంచిది. అలా కాకపోతే సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో .. ఎప్పుడు థియేటర్లలో నుంచి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Please Read Disclaimer