మూడేళ్ల గ్యాప్ తర్వాత జాక్ పాట్ డైరెక్టర్స్

0

పరిశ్రమలో సక్సెస్ చాలా ముఖ్యం. అది లేకపోతే ఏదీ లేదు. అందుకే ప్రతి సినిమాని మొదటి సినిమాగా భావించి హిట్టుకోసం శ్రమిస్తుంటారు దర్శకులు. అలా మొదటి సినిమాతో హిట్లు కొట్టి ఆ తర్వాత ఫ్లాపులు ఎదురై.. ఏకంగా మూడేళ్ల గ్యాప్ వచ్చాక ఓ ముగ్గురు దర్శకులకు అవకాశాలు రావడం మిరాకిల్ అని చెప్పాలి.

అలా ఛాన్సులు దక్కించుకున్న ఆ ముగ్గురూ సరైన బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? అంటే బొమ్మరిల్లు భాస్కర్- సంతోష్ శ్రీనివాస్- శ్రీకాంత్ అడ్డాల. ఈ ముగ్గురూ ప్రతిభావంతులే. కానీ అనూహ్య కారణాలు దెబ్బ కొట్టాయి. కెరీర్ ఆరంభంలోనే బొమ్మరిల్లు- పరుగు చిత్రాలతో భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్న సంగతి తెలిసిందే. తర్వాత తీసిన మూడు చిత్రాలు ఫ్లాపులయ్యాయి. దీంతో మరో అవకాశం రావడానికి మూడేళ్లు పైగానే ఎదురు చూడాల్సొచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా చివరికి బాస్ అల్లు అరవింద్ ని స్క్రిప్టుతో పడేశాడు. అక్కినేని వారసుడు అఖిల్ నాల్గవ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం అరవింద్ కల్పించారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టి రేసులోకి రావాలని చూస్తున్నాడు భాస్కర్. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత చేస్తోన్న చిత్రమిది.

కందిరీగ లాంటి బ్లాక్ బస్టర్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన సంతోష్ శ్రీనివాస్ అనంతరం ఎన్టీఆర్ హీరోగా .. బెల్లంకొండ నిర్మాతగా.. రభస తెరకెక్కించాడు. సినిమా ఫ్లాపవ్వడంతో విమర్శలు తప్పలేదు. ఆ తర్వాత హైపర్ తో మెప్పించినా అవకాశాలైతే రాలేదు. మధ్యలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – మైత్రి మూవీస్ సినిమాకి స్క్రిప్టు రెడీ చేసి దురదృష్టం వల్ల సెట్స్ కెళ్లలేకపోయాడు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం సంతోష్ కి పెద్ద మైనస్ అయ్యింది. తాజాగా మరోసారి బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించారు. ఆ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. సంతోషం శ్రీనివాస్ కు మూడేళ్లు గ్యాప్ తర్వాత వచ్చిన చిత్రమిది.

ఇక శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి మరీ విచిత్రమైనది. కొత్తబంగారు లోకం – సీతమ్మవాటికట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాసిక్స్ ని తీసి ఫ్యామిలీ ఆడియెన్ మెచ్చే దర్శకుడిగా మెప్పు పొందాడు. రెండు వరుస విజయాలు అందుకున్నాడు. తర్వాత చేసిన ముకుంద యావరేజ్ గా ఆడినా వెంటనే అవకాశం రాలేదు. దీంతో మూడేళ్లు ఖాళీగానే ఉన్నాడు. అదే సమయంలో మహేష్ తో `బ్రహ్మోత్సవం` తెరకెక్కించినా ఫ్లాపైంది. ఒక్క ఫ్లాప్ అతడిపై చాలా పెద్ద ప్రభావమే చూపించింది. ఇటీవలే తమిళ చిత్రం అసురన్ ని తెలుగులో రీమేక్ చేసే అవకాశం వెంకటేష్-సురేష్ బాబు కల్పించారు. శ్రీకాంత్ గీతా ఆర్ట్స్ లోనూ ఓ చిత్రానికి కమిటయ్యారని ఇంతకుముందు వార్తలొచ్చాయి.

ప్రస్తుతం ఈ ముగ్గురి కంబ్యాక్ పైనే అందరి ఆసక్తి. టైమ్ కలిసిరాక.. కొన్నాళ్లు వెనకబడొచ్చేమో కానీ ప్రతిభను ఎవరూ ఆపలేరు. కష్ట కాలంలోనూ ఏదో ఒక అవకాశం వస్తుంది సద్వినియోగం చేసుకుని కంబ్యాక్ అయ్యేందుకు.. ఇప్పుడు ఆ ముగ్గురికి అలాంటి అవకాశమే దక్కింది. మరి ఈ ఛాలెంజ్ లో నెగ్గి సత్తా చాటుతారా..? నమ్మకం నిలబెడతారా లేదా? అన్నది చూడాలి.
Please Read Disclaimer