రాంగోపాల్ వర్మకు జగన్ షాక్

0

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీపై వస్తున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. మొన్నటి ఎన్నికల వేళ.. అనంతర రాజకీయ పరిణామాలపై తీసిన ఈ చిత్రం ఈరోజు విడుదల చేయడానికి ప్లాన్ చేసినా సెన్సార్ కానీ కారణంగా ముందడుగు పడలేదు.

ఇక ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ చిత్రంలో తనను కించపరిచాడని కేఏపాల్ హైకోర్టుకెక్కారు. విచారించిన కోర్టు వారంలో చిత్రాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును తెలిపింది.

ఇక మరో వివాదమూ చుట్టుముట్టింది. ఈ సినిమా పేరు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని టైటిల్ మార్చాలంటూ కొందరు హైకోర్టుకెక్కారు. ఇలా అన్ని అభ్యంతరాలను పరిష్కరించుకుంటూ వస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మకు తాజాగా ఏపీలోని జగన్ సర్కారు షాకిచ్చింది. ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ సినిమా పేరును మార్చాలని తాజాగా జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి రీజనల్ సెన్సార్ బోర్డు అధికారులకు లేఖ రాయడం కలకలం రేపింది. కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఈ టైటిల్ ఉందని.. ప్రజల్లో అలజడి రేపేలా ఉందని మార్చాలని కోరారు.

చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్మ.. జగన్ పై ప్రేమతోనే ఈ సినిమా తీశాడు. ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఈ సినిమాపై అభ్యంతరం తెలుపడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక హైకోర్టు సూచన జగన్ సర్కారు అభ్యంతరాల నేపథ్యంలో సినిమా టైటిల్ ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మారుస్తానంటూ ఇప్పటికే వర్మ ప్రకటించారు.
Please Read Disclaimer