మరో ఛాలెంజింగ్ రోల్ లో జాను

0

అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వంతో హీరోయిన్ గా పరిచయం అయిన జాన్వి కపూర్ ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. మొదటి సినిమాలో నటిగా మంచి మార్కులు దక్కించుకున్నా ఇటీవల వచ్చిన గుంజన్ సక్సేనా లో నటనకు గాను విమర్శలు ఎదుర్కొంది. ఎయిర్ ఫోర్స్ లేడీ అంటే ఇలాగేనా ఉండేది అంటూ విమర్శలు ఎదుర్కొంది. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఆ పాత్ర ఎందుకు చేశానా అనుకునేలా ఆమెను ట్రోల్ చేశారు. ఆమె ట్రోల్స్ విషయంలో చాలా బాధపడింది. అయితే తనకు విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయని తానేం విమర్శలకు బాధపడటం లేదంటూ పేర్కొంది. ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ కు సిద్దం అయ్యింది.

కొత్త హీరోయిన్స్ ఎక్కువగా హీరోల పక్కన రొమాంటిక్ పాత్రల్లో నటిస్తూ ఉంటారు. కాని జాన్వీ కపూర్ మాత్రం కెరీర్ ఆరంభంలోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కొలమావు కోకిల’ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఆ సినిమా 2018 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న ఆ సినిమాలో నయనతార ఒక మద్య తరగతి అమ్మాయిగా గడుసైన అమ్మాయిగా కనిపించింది.

అమాయకంగా కనిపిస్తూనే గడుసుగా ఉండే ఆమ్మాయి పాత్రలో నయనతార ఆకట్టుకుంది. తెలుగులో కో కో కోకిల అనే టైటిల్ తో డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. కోకిల పాత్ర అంటే ఖచ్చితంగా ఛాలెంజింగ్ పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. జాన్వి కపూర్ ఆ పాత్రను చేసి మెప్పించగలిగితే కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆ పాత్ర చేయాలంటే చాలా మెచ్యూరిటీ మరియు ప్రతిభ అవసరం. మరి జాన్వి కపూర్ ఆ స్థాయిలో మెప్పించగలుగుతుందా లేదా అనేది చూడాలి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను దక్కించుకుంది. త్వరలోనే సినిమా దర్శకుడు ఇతర టీమ్ ను ప్రకటించే అవకాశం ఉంది.