మా పిల్లలను ట్రోలింగ్ చేయవద్దు: జీవిత

0

ఎలాంటి విషయానికైనా రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచి చెడు ఉంటాయి. మంచి మాత్రమే కావాలి.. చెడు ఉండకూడదు అంటే ఊహించుకోవడానికి బాగుంటుంది కానీ నిజంగా అది జరగదు. సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సెలబ్రిటీలకు ఎంత ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుందో అదే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా దీనికి అతీతం కాదు. అయితే సీనియర్ నటి జీవిత మాత్రం తన పిల్లలను ట్రోలింగ్ చేయవద్దని కోరుతోంది.

రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న ‘చూసీ చూడంగానే’ సినిమా ఈవెంట్ ఈమధ్యే జరిగింది. ఈ కార్యక్రమానికి జీవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ రాజ్ కందుకూరి గారు.. మథుర శ్రీధర్ రెడ్డి గారు తమ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారని చెప్పారు. తనకు కూతుర్లు శివాని.. శివాత్మిక ఎంతో శివ కందుకూరి కూడా అంతేనని.. కొడుకు లాంటివాడని చెప్పారు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి చాలా సార్లు తమ మధ్య చర్చలు జరిగాయని.. ఇప్పుడు శివ ‘చూసీ చూడంగానే’ సినిమాతో హీరోగా పరిచయం అవుతూ ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ పిల్లలు ఎంతో ఆశతో ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారని.. వారిని ప్రోత్సహించాలని మీడియాను.. ప్రజలను కోరారు. “సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం అన్నది గొప్పగా అనుకోకుండా దాన్ని పక్కనబెట్టి.. మా పిల్లలో మంచి ఏదో ఉందో అది చూపించి ఎంకరేజ్ చెయ్యండి.. దీవించండి” అంటూ జీవిత విజ్ఞప్తి చేశారు. జీవిత రిక్వెస్ట్ చేశారు కానీ నెటిజన్లు అలా ఊరుకునేవారు కాదు. నచ్చితే మెచ్చుకుంటారు. లేకపోతే చీల్చి చెండాడతారు. సర్వ శక్తి సంపన్నుడు.. సూపర్ మ్యాన్ లాంటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నే ట్రోలర్లు వదలడం లేదు.. ఇక సాధారణమైన సెలబ్రిటీలను ఎలా వదిలేస్తారు?




Please Read Disclaimer